పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి

8 Jun, 2021 05:34 IST|Sakshi

బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లపై కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్ల విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాల వారీగా బ్లాక్‌ఫంగస్‌ కేసులెన్ని.. ఇంజక్షన్లను ఎలా సమకూర్చుకుంటున్నారు.. రాష్ట్రాలకు వాటిని ఎలా కేటాయిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్ల నిల్వలు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నపిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌)ను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజ యలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా విషయంలో హైకోర్టులో పలు ప్ర జాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలి సిందే.

ఈ వ్యాజ్యాలను కొద్ది వారాలుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్ల విషయంలో ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ మెమోను కోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి గతంలో కేటాయించిన 13,830 ఇంజక్షన్లు కాక, ఈ నెల 5న మరో 7,770 వయల్స్‌ కేటాయించా మన్నారు. మే నెలాఖరుకు కేంద్రం వద్ద బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్లు 4.38 లక్షలున్నాయని, వాటిలో 2.02 లక్షలు దేశీయంగా ఉత్పత్తి చేసినవి, 2,33,971 ఇంజక్షన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని వివరించారు. రాష్ట్రాలకు సరఫరా చేయగా ప్రస్తుతం కేంద్రం వద్ద 80 వేల ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు.

కేంద్రం కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలో గత నెలాఖరు నాటికి 1,400 ఉన్న బ్లాక్‌ఫంగస్‌ కేసులు ప్రస్తుతం 1,770కి పెరి గాయని తెలిపారు. బాధితుల చికిత్సకు కేంద్రం కేటాయించిన 7,770 వయల్స్‌ ఎంతమాత్రం సరిపోవన్నారు. కేటాయింపులను పెంచకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అనంతరం ధర్మాసనం కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సుమన్‌ స్పందిస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే ఏర్పాటు చేసిన పీడియాట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందితోసహా దాదాపు 38 వేల మంది అదనపు సిబ్బందిని నియమించామని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టు ముందు మెమో కూడా దాఖలు చేశామని సుమన్‌ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టాలని, పారామెడికల్‌ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలంది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్‌ కోర్సులు పూర్తిచేసి పీజీ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సేవల్ని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు