నోటీసులకు మార్గదర్శి సమాధానం ఇవ్వాల్సిందే

27 Dec, 2022 03:56 IST|Sakshi

నాలుగు వారాల్లో జవాబు ఇవ్వండి

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు హైకోర్టు ఆదేశం

మార్గదర్శి సమాధానంపై నిష్పాక్షికంగా వ్యవహరించండి

అప్పటి వరకు ఎలాంటి బలవంతపు చర్యలొద్దు

అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన న్యాయస్థానం

సాక్షి, అమరావతి: చిట్‌ల నిర్వహణలో పలు అవ­క­తవకలను ఎత్తిచూపుతూ రిజిస్ట్రార్లు ఈ నెల 20న జారీ చేసిన నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇచ్చి తీరాల్సిందేనని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను హైకోర్టు ఆదేశించింది. చిట్‌ఫండ్‌ చట్టం సెక్షన్‌ 46(3)లో నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి మార్గదర్శి వివరణ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది.

అప్పటి­వరకు మార్గదర్శి విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని అధికారులకు చెప్పింది. అను­మతి, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల స్వీకరణ, సెక్యూ­రిటీ డిపాజిట్‌ విడుదల తదితర విషయాల్లో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. అనుబంధ వ్యాజ్యాలపై తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనుబంధ వ్యాజ్యాల్లోని పూర్వాపరాల జోలికి ప్రస్తుతం వెళ్లడంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పెనాల్టీ వద్దంటూ అనుబంధ వ్యాజ్యాలు
చిట్స్‌ వ్యవహారంలో అధికారులు నిబంధనల మేర నడుచుకుకోవడంలేదంటూ మార్గదర్శి చిట్‌­ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధీకృత అధికారి బి.­శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్, ఎలాంటి పెనాల్టీ విధించకుండా ఉండటంతో పాటు ప్రతి దశలోనూ నిబంధనల ప్రకారం నడుచు­కు­నేలా అధికారులను ఆదేశించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై గత వారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేశారు. సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తన ఉత్తర్వుల్లో చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనలను ఉదహరించారు.

అధికారి అనుమతి లేకుండా చిట్‌ నిర్వహించడానికి వీల్లేదు
‘ఈ చట్టంలో ప్రతి దశలోనూ చందాదారు ప్రయోజనాలను పరిరక్షించేందుకు జాగ్రత్తలు పొందుపరిచారు. చిట్‌  ప్రతి దశను సంబంధిత రిజిస్ట్రార్‌కు ఫోర్‌మెన్‌ (చిట్‌ నిర్వాహకుడు) తెలియజేసి తీరాలి. సంబంధిత అధికారి అనుమతి లేకుండా ఫోర్‌మెన్‌ చిట్‌ను నిర్వహించకూడదు. ఆ చిట్‌పై అధికారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. మార్గదర్శి 1962 నుంచి చిట్స్‌ వ్యాపారం చేస్తోంది.

మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది వాదన ప్రకారం వారి చందాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదు. ఒకవేళ వ్యాపార నిర్వహణలో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు అధికారులు నోటీసులు ఇవ్వాలి. అలాంటి నోటీసులేవీ ఇవ్వలేదు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని, మార్గదర్శికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నా.

ప్రస్తుతానికి మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగవేతదారు కాదు. సోదాల్లో బయటపడిన లోపాలను సరిదిద్దుకోవాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ లోపాలకు మార్గదర్శి వివరణ ఇవ్వాల్సిందే. చిట్‌ ప్రారంభానికి ముందే ఫోర్‌మెన్‌ చిట్‌ స్థూల మొత్తంలో 50 శాతాన్ని రిజిస్ట్రార్‌ వద్ద డిపాజిట్‌ చేయాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు గ్యారెంటీ రూపంలో చూపాలి’ అని జస్టిస్‌ సుబ్బారెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నోటీసుల్లో రిజిస్ట్రార్లు చూపిన కొన్ని అవకతవకలు
► ప్రస్తుతం కొనసాగుతున్న, గతంలో రద్దయిన ఏ చిట్‌ గ్రూప్‌నకు ప్రైజ్‌మనీ సెక్యూరిటీని చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల ప్రకారం ఫోర్‌మెన్‌ సమర్పించలేదు.
► వ్యక్తిగత చిట్‌ గ్రూపు ఆస్తి అప్పుల పట్టీలు, వ్యయాల రశీదులు సమర్పించలేదు. చిట్‌ రద్దయిన నిర్దిష్ట కాల వ్యవధిలో వ్యక్తిగత చిట్‌ గ్రూపు ఆస్తి, అప్పుల పట్టీలు, వ్యయాల రశీదులు సమర్పించడం తప్పనిసరి.
► భవిష్యత్తు చందా నుంచి ఏదైనా మొత్తాన్ని ఉపసంహరించినప్పుడు ఆ మొత్తాన్ని చిట్‌ ఒప్పందంలో పేర్కొన్న గుర్తింపు పొందిన బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి. ఈ డిపాజిట్‌ మొత్తాన్ని భవిష్యత్తు చందా కోసం తప్ప ఏ ఇతర అవసరం కోసం ఉపసంహరించకూడదు. అయితే మార్గదర్శి ఆ మొత్తాన్ని ఒప్పందంలో పేర్కొన్న బ్యాంకులో కాకుండా, మార్గదర్శి కార్పొరేట్‌ ఆఫీసు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. ఇలా కార్పొరేట్‌ ఆఫీసు ఖాతాలో జమ చేస్తున్న మొత్తాన్ని ఏ అవసరాలకు వాడుతున్నారో తెలపాలి.
► చందాలు, ప్రైజ్‌మనీ తదితరాలను ఏం బ్యాంకులో డిపాజిట్‌ చేస్తున్నారో ఆ బ్యాంకు ఖాతాల నంబర్లను చిట్‌ ఒప్పందంలో పేర్కొనడంలేదు.
► చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని అనాథరైజ్డ్‌ డిపాజిట్లుగా బ్యాంకు ఖాతాలో అలాగే ఉంచారు. 

అవకతవకలకు సమాధానం ఇవ్వకుండా హైకోర్టుకు
సోదాల్లో బయటపడిన ఈ అవకతవకలను ప్రస్తావిస్తూ వీటికి సంబంధించి రికార్డులను, సమాచారాన్ని ఇవ్వాలని మార్గదర్శి సిబ్బందిని కోరినా వారు ఇవ్వలేదు. పైగా, అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించడంలేదంటూ మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది.

>
మరిన్ని వార్తలు