ఆ స్థలాల్లో ఆక్రమణలు తొలగించండి

16 Sep, 2022 03:22 IST|Sakshi

పార్కులు, ప్రజోపయోగ స్థలాలపై హైకోర్టు ఆదేశం

ముందుగా ఆక్రమణదారులకు నోటీసులివ్వండి

అనంతరం ఖాళీకి ఉత్తర్వులు జారీ చేయండి

నాలాలు, కాలువల ఆక్రమణలకూ ఈ ఉత్తర్వులే..

సాక్షి, అమరావతి: పార్కులు, పబ్లిక్‌ రోడ్లు, ఇతర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణలు తొలగించేటప్పుడు ఆక్రమణదారులకు షోకాజ్‌ నోటీసు జారీచేసి వారి వాదన వినాలని అధికారులకు హైకోర్టు స్పష్టంచేసింది. ఆ తర్వాతే వారిని ఖాళీచేయించే విషయంలో ఉత్తర్వులు జారీచేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

పార్కులు, రోడ్లు తదితర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పంచాయతీ, పురపాలక, అటవీ, రెవెన్యూ భూములను ఆక్రమించుకున్న వారిని ఆ భూముల నుంచి ఖాళీచేయించాలంటూ బుధవారం ఇచ్చిన ఆదేశాలను ఈ వ్యాజ్యాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (రెవెన్యూ) పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి స్పందిస్తూ.. నాలాలు, కాలువలు పెద్ద సంఖ్యలో ఆక్రమణలకు గురై ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో మనకు బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పరిస్థితి రాకూడదంటే నాలాలు, కాలువలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

నిజమే.. హైదరాబాద్, బెంగళూరు వంటి పరిస్థితి రాకూడదన్న ధర్మాసనం, ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో నాలాలు, కాలువలను కూడా చేరుస్తామని తెలిపింది. వీటి తొలగింపు విషయంలో పంచాయతీ, పురపాలక శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తారిని సుభాష్‌ చెప్పారు. ఈ వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.  

మరిన్ని వార్తలు