పయ్యావుల భద్రత పునరుద్ధరణకు ఆదేశాలిస్తాం

23 Feb, 2023 05:54 IST|Sakshi

ఐదారుగురు సిబ్బంది పేర్లు ఇవ్వండి.. 

అందులో ఇద్దరిని భద్రతకు నియమిస్తాం

హోంశాఖకు హైకోర్టు ఆదేశం 

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు భద్రత పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు లేదా ఆరుగురు పోలీసు భద్రతా సిబ్బంది పేర్లను తమకు ఇవ్వాలని, అందులో నుంచి ఇద్దరిని భద్రతా సిబ్బందిగా నియమిస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కేశవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కేశవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పోలీసు భద్రతను పునరుద్ధరించాలని కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టుకొచ్చామన్నారు. గతంలో పిటిషనర్‌ వద్దే పనిచేసిన భద్రత సిబ్బందిని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. 

భద్రతను మేం తొలగించలేదు..
ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. భద్రతను తొలగించామన్న పిటిషనర్‌ వాదన అవాస్తవమని చెప్పారు. పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ను మార్చామన్న కారణంతో ఇతర భద్రత సిబ్బందిని కూడా పిటిషనరే వెనక్కి పంపారని తెలిపారు. భద్రత కల్పన విషయంలో ప్రభుత్వం జీవో ప్రకారం రొటేషన్‌ విధానాన్ని అనుసరిస్తోందన్నారు.

పిటిషనర్‌ కోరిన వారినే భద్రతా సిబ్బందిగా ఇవ్వలేమని చెప్పారు. అలా ఇస్తే రేపు ప్రతి ఒక్కరు ఫలానావారే తమకు కావాలని కోరతారని పేర్కొన్నారు. 2+2గా ఉన్న భద్రతను 1+1కి కుదించడంపై కౌంటర్‌ దాఖలు చేశామన్నారు.

ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో ఉండే ప్రత్యేక పరిస్థితులపై తనకు అవగాహన ఉందని చెప్పారు. పిటిషనర్‌కు భద్రతను పునరుద్ధరించేందుకు తగిన ఆదేశాలిస్తామని, ఐదారుగురు సిబ్బంది పేర్లు ఇస్తే అందులో ఇద్దరిని భద్రతా సిబ్బందిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేస్తానని తెలిపారు.   

మరిన్ని వార్తలు