జీవో 42 రద్దు

13 Oct, 2021 04:50 IST|Sakshi

ఒక్కో కాలేజీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోండి

ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్‌ వైద్య విద్య కోర్సులకు 2017–18 నుంచి 2019–20 బ్లాక్‌ పీరియడ్‌ కాలానికి ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్‌ 15న జారీ చేసిన జీవో 42ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) నిర్ణ యించిన ఫీజులను, ప్రభుత్వానికి పంపుతూ ఇచ్చిన కమ్యూనికేషన్‌ను రద్దు చేసింది. హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఫీజులను నిర్ణయించ లేదని ఆక్షేపించింది. ఫీజుల నిర్ణయం విషయంలో ఆయా కాలేజీలు లేవనెత్తే అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని తామిచ్చిన ఆదేశా లను పట్టించుకోలేదంది.

అలాగే ఒక్కో కాలేజీకి సంబంధించి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆదేశాలను కూడా ఏపీహెచ్‌ఈఆర్‌ ఎంసీ బేఖాతరు చేసిందని హైకోర్టు ఆక్షేపించింది. జీవో 42 ఆధారంగా ఫీజు ఖరారు చేసిన విద్యా సంస్థల్లో తిరిగి ఫీజులను నిర్ణయించి నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫీజుల విషయంలో ఏవైనా ఆధారా లను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంటే, ఆ ఆధారాలను సంబంధిత కాలేజీ ముందు ఉంచి వారి వాదనలు వినాలంది.

ఫీజుల నిర్ణయానికి సంబంధించి ప్రతి కాలేజీ విషయంలో వేర్వేరుగా తగిన కారణాలతో లిఖితపూర్వకంగా ఉత్తర్వులివ్వా లంది. కమిషన్‌ తన ఫీజుల ఖరారు ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపాలంది. ఆ ఉత్తర్వులు అందు కున్న వారంలోపు ఆ ఫీజును ప్రభుత్వం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌ రావు ఇటీవల తీర్పు వెలువరించారు.  

మరిన్ని వార్తలు