ఆ డ్రైవర్‌ తొలగింపు చెల్లదు: ఏపీ హైకోర్టు ధర్మాసనం

17 May, 2022 05:40 IST|Sakshi

వైద్యపరమైన సాక్ష్యం లేకపోతే మద్యం తాగినట్టు నిర్ధారించలేం

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: మద్యం మత్తులో డ్రైవర్‌ బస్సు నడిపారంటూ ప్రయాణికులు, సహోద్యోగులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. డ్రైవర్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతోపాటు అతనికి ప్రయోజనాలన్నీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.  

ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మే నేజర్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

మద్యం మత్తులో బస్సు నడుపుతున్నారన్న ఆరోపణలపై విశాఖపట్నంలోని జ్ఞానాపురానికి చెందిన సీహెచ్‌ వెంకటేశ్వరరావు అనే డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంకటేశ్వరరావు ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ వెంకటేశ్వరరావు తొలగింపును సమర్థిం చింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, మద్యం తాగి వాహనం నడిపారన్న విషయంలో ప్రయాణికులు, సహోద్యోగి చెప్పిన సాక్ష్యం ఆధారంగా వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడం చెల్లదన్నారు. మద్యం తాగారని నిరూపించేందుకు వైద్య పరమైన సాక్ష్యం ఉండాలని తీర్పునిచ్చారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్‌ చేస్తూ విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చింది. 

మరిన్ని వార్తలు