ప్రజల ప్రాణాలతో ఆటలా?.. అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్‌

29 Oct, 2021 03:56 IST|Sakshi

కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు..

పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది..

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరగణిస్తున్నాం

డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

నివేదిక ఇవ్వాలని పీసీబీకి ధర్మాసనం ఆదేశం..

విచారణ నవంబర్‌ 9కి వాయిదా  

సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని, డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌లో పర్యావరణ కాలుష్యంపై న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. కాసుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తేల్చి చెప్పింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

అమరరాజా బ్యాటరీస్‌లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేసింది. అమరరాజా బ్యాటరీస్‌ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్‌ మూసివేతకు పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఉత్తర్వులిచ్చింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తాజాగా జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతంలో అమరరాజా ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య స్థితిపై పీసీబీ సమర్పించిన నివేదికలను పరిశీలించింది. ఆ నివేదికల్లో కార్మికులు, ఉద్యోగుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించింది. ఇదిలాఉంటే ఇదే కేసులో, తమ సంస్థలో ఎలాంటి అధ్యయనం చేయకుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమరరాజా బ్యాటరీస్‌ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది.   

మరిన్ని వార్తలు