ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్‌

30 Nov, 2022 07:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాకిచ్చింది. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చెల్లించడంలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మపై వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది దశకు చేరుకోనందువల్ల సీఎస్‌ చర్యలను ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా పరిగణించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

తరువాతి కాలంలో సీఎస్‌ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు వస్తాయని వెంకటేశ్వరరావు భావిస్తే తగిన పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్‌ సోమయాజులు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.

చదవండి: (సీఎం జగన్‌ వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన ఖరారు.. రెండు రోజుల పాటు..)

ఏబీ తరపున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టేసి, జీత భత్యాలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. సుప్రీం కోర్టు కూడా సస్పెన్షన్‌ను ఎత్తివేసిందన్నారు. అయినా సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించడంలేదని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని చెప్పారు. ఈ వాదనలను సమీర్‌ శర్మ తరపు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి తోసిపుచ్చారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో వెంకటేశ్వరరావుపై నమోదైన కేసు విచారణ తుది దశలో ఉందన్నారు.

సుప్రీం కోర్టు కేసు పూర్వాపరాల ఆధారంగా ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయలేదని, సస్పెన్షన్‌ రెండేళ్లకు మించి ఉండరాదన్న నిబంధనను మాత్రమే అనుసరించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని సర్వీసులోకి తీసుకుందని, అంతమాత్రాన జీత భత్యాలన్నీ చెల్లించాలని ఓ హక్కుగా కోరడానికి వీల్లేదన్నారు. విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించాలా లేదా అన్నది ప్రభుత్వ విచక్షణ అని చెప్పారు.

వెంకటేశ్వరరావుపై విచారణ ముగిసి, నిర్ణయం వెలువడిన తరువాత, సస్పెన్షన్‌ సమర్థనీయం కాదని ప్రభుత్వం భావిస్తేనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. కాబట్టి సీఎస్‌ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు రావన్నారు. మహేశ్వరరెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. సస్పెన్షన్‌ ‘ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అన్న మాటలకు ఎంతో విలువ ఉందని ధర్మాసనం తెలిపింది.

సుప్రీంకోర్టు, ప్రభుత్వం వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ‘ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అని తేల్చలేదని, ఆరోపణల నుంచి విముక్తి ప్రసాదించలేదని తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావుపై విచారణ తుది దశలో ఉందని, దీన్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు నివేదించారని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని గుర్తు చేసింది. వెంకటేశ్వరరావు పూర్తి జీతభత్యాలకు అర్హులా కాదా అన్న విషయాన్ని ఈ దశలో.., ముఖ్యంగా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తేల్చడం సాధ్యం కాదని చెప్పింది.  

మరిన్ని వార్తలు