రుషికొండ తవ్వకాలపై సర్వే

4 Nov, 2022 05:12 IST|Sakshi

తదుపరి విచారణ డిసెంబర్‌ 14కి వాయిదా  

సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ(ఎంవోఈఎఫ్‌)ను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకోసం బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.

రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 

రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు...
ఏపీఎండీసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..  ప్రాజెక్టు పనుల్లో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో కొత్తవి నాటుతున్నామని, అది భారీ స్థాయిలో చేపట్టామని వివరించారు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్ల చిత్తశుద్ధి, నిజాయితీని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పిల్‌ దాఖలు చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం గానే ఉంటారని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ మూర్తి యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు