Andhra Pradesh: సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు

27 Jul, 2021 15:42 IST|Sakshi

నాణ్యమైన ఉత్పత్తులతో రైతులకు మరింత ప్రయోజనం

సేంద్రియ ఆక్వాసాగుకు విధానం రూపొందిస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సేంద్రియ ఆక్వాపాలసీ తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. మితిమీరిన రసాయనిక ఎరువుల వినియోగం వల్ల భూమి నిస్సారమవడంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రజల ఆరోగ్యాల మీద ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సేంద్రియ సాగు కోసం ఒక విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం ఆక్వాకల్చర్‌లో కూడా సేంద్రియ పద్ధతిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫామింగ్‌ (ఏఐఎఫ్‌వోఎఫ్‌) ఆమోదంతో 2007లో బ్లూయూ సంస్థ ద్వారా మన రాష్ట్రంలో సేంద్రియ ఆక్వాసాగుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకారం చుట్టినా ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రోత్సాçహం లభించలేదు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియసాగును ప్రోత్సహించేందుకు ఒక విధానాన్ని తీసుకొస్తోంది. 

మోతాదుకు మించి యాంటిబయోటిక్స్‌.. 
రాష్ట్రంలో 2010–11లో 14.23 లక్షల టన్నులున్న ఆక్వా ఉత్పత్తులు 2020–21లో ఏకంగా 46.23 లక్షల టన్నులకు పెరిగాయి. సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపవగా రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి ఏకంగా 15 రెట్లు పెరిగాయి. అధికోత్పత్తే లక్ష్యంగా మోతాదుకుమించి యాంటిబయోటిక్స్, ఎరువులు, సింథటిక్, పురుగుమందులు వినియోగించడం, టన్ను ఉత్పత్తి కోసం 3 టన్నుల వైల్డ్‌ఫిష్‌ను మేతగా వినియోగించంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.

ఏటా పుట్టుకొస్తున్న వైరస్‌లు, వ్యాధులు పెట్టుబడులను పెంచేస్తున్నాయి. దేశీయ ఆక్వా ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మోతాదుకు మించి ఉంటున్నాయనే సాకుతో చైనా, యూరోపియన్‌ దేశాలు తరచు వెనక్కి పంపుతుండడం ఎగుమతులపైన, ఆర్థిక వ్యవçస్థపైన ప్రభావం చూపుతోంది. చివరికి రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఎగుమతులకు అనువుగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలంటే సేంద్రియ సాగే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం నిర్ణయించింది.

సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు

  • సేంద్రియ పద్ధతుల్లో ఆక్వాసాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం.
  • యాంటిబయోటిక్స్, హార్మోన్స్‌ వాడకుండా ప్రభుత్వం గుర్తించిన సంస్థల ద్వారా సేంద్రియ పద్ధతుల్లో తయారుచేసిన, జన్యుమార్పిడి లేని çసర్టిఫైడ్‌ సీడ్, ఫీడ్‌ను రైతులకు అందించడం.
  • సహజమైన పద్ధతుల్లోనే చెరువుల నిర్వహించడం.
  • పర్యావరణానికి హానిలేనివిధంగా నీటిమార్పిడి విధానం అవలంభించడం. 
  • సాగులో రసాయన ఎరువులు, పురుగుమందులు, సింథటిక్‌ మందుల వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం.
  • చేపలు, రొయ్యలను దశల వారీగా పట్టుబడి పట్టి సేంద్రియ పద్ధతుల్లోనే శుద్ధిచేసి ప్యాకింగ్‌ చేయడం.
  • గుర్తించిన ఏజెన్సీల ద్వారా సర్టిఫై చేసిన తర్వాతే మార్కెట్‌లోకి తీసుకురావడం, విదేశాలకు ఎగుమతిచేయడం.

సేంద్రియంతో ఖర్చు తగ్గుతుంది
ఆక్వాసాగులో ఎక్కడా యాంటిబయోటిక్స్‌ వాడటం లేదు. ఎకరాకు 1,500 చేపలు, 50 వేల రొయ్యలు వేస్తాం. చేపలకు తవుడు పర్మంటేషన్‌ చేసి ఇస్తాం. రొయ్యలకు సోయా లేదా పాలికల్చర్‌ మేత అందిస్తాం. 10 రోజులకోసారి కాకరకాయ జ్యూస్‌ ఇస్తాం. చేపకు శంకుజలగ వంటి జబ్బులు రావు. రొయ్యల్లో వెబ్రియో కూడా కంట్రోల్‌ అవుతుంది. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తే ఖర్చు బాగా తగ్గుతుంది. సబ్సిడీపై ఆర్గానిక్‌ సర్టిఫైడ్‌ సోయా అందిస్తే మంచి ఫలితాలొస్తాయి.
– ఎ.ఫణికుమార్, ఆక్వారైతు, చిన్నపులేరు, పశ్చిమగోదావరి

వ్యాధులను తట్టుకుంటున్నాయి
నేను 40 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగుచేస్తున్నా. మార్కెట్‌లో లభించే మేత వాడుతున్నప్పటికీ ఎక్కడా యాంటిబయోటిక్స్, కెమికల్స్‌ వాడడం లేదు. దేశీయ మేలుజాతి గో మూత్రంతో తయారుచేసిన జీవామృతం, ద్రవజీవామృతం వాడుతున్నా. వ్యాధులను తట్టుకుంటున్నాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ సీడ్, ఫీడ్‌ అందిస్తే మంచి ఫలితాలొస్తాయి. – శ్రీహరిరాజు, పటవల, తూర్పుగోదావరి

సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే..
ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.  త్వరలో తీసుకొస్తున్న సేంద్రియ పాలసీలో భాగంగా సర్టిఫికేషన్‌ చేసిన ముడిసరుకు తయారీ, సాగువిధానం, గిట్టుబాటు ధర కల్పన, మార్కెటింగ్, ఎగుమతుల కోసం విధివిధానాలు రూపొందించేందుకు నిపుణులు, మేధావుల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. – ఎస్‌.అంజలి, అదనపు డైరెక్టర్, మత్స్యశాఖ 

మరిన్ని వార్తలు