కేసుల పెరుగుదలతో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ 

11 Jan, 2022 07:51 IST|Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేయాలని సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలన్నారు. థియేటర్లలో సీటు మార్చి సీటు విధానాన్ని ప్రవేశపెట్టాలని.. ప్రేక్షకులకు మాస్క్‌ తప్పనిసరి చేయాలని ఆయన స్పష్టంచేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అందరూ భౌతిక దూరం పాటించేలా.. మాస్క్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని, కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పలు ఆదేశాలు జారీచేశారు. అవి.. 

సమర్థవంతంగా కరోనా నివారణ 
అధికార యంత్రాంగం కోవిడ్‌ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలుచేయాలి. 
 భౌతిక దూరం పాటించని.. మాస్క్‌లు ధరించని పక్షంలో కచి్చతంగా జరిమానాలు కొనసాగించాలి.  
 దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలి. 
 బస్సు ప్రయాణికులు కూడా విధిగా మాస్క్‌ ధరించేలా చూడాలి. 
 బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకూడదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీచేయనుంది. 

నియోజవర్గానికి ఓ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ 
ఇక 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలని కూడా ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఎవరు కాల్‌ చేసినా వెంటనే స్పందించేలా ఉండాలని.. అలాగే,  కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధంచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలని ముఖ్యమం‘త్రి సూచించారు.  

హోం కిట్‌లో మార్పులు 
కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో హోం కిట్‌లో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య నిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలన్నారు. అంతేకాక.. చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపైనా సమీక్షించారు. అవసరమైన మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు