AP: 2022లో పారిశ్రామిక ప్రగతిలో కీలక ఘటనలు

29 Dec, 2022 05:17 IST|Sakshi

రూ.1,66,919.71 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం 

దావోస్‌లో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు 

గ్రాసిం క్లోర్‌ ఆల్కాలిక్, నోవా ఎయిర్, ఐటీసీ స్పైసెస్‌పార్క్, ఐటీసీ వెల్కం హోటల్‌ ప్రారంభం 

టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్‌టెక్, డిక్సన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ యూనిట్ల ప్రారంభం 

రామాయపట్నంపోర్టు, అపాచీ ఫుట్‌వేర్‌ పార్క్, అస్సాగో బయో ఇథనాల్‌ వంటి పలు యూనిట్లకు శంకుస్థాపన 

అనంతపురం, విశాఖల్లో రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి ఒప్పందం  

లాజిస్టిక్‌ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా 2022–27 లాజిస్టిక్‌ పాలసీ విడుదల  

వచ్చే ఏడాది గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ లోగో ఆవిష్కరణ 

50వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏపీఐఐసీ ప్రత్యేక లోగో ఆవిష్కరించిన సీఎం 

రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎంని కలిసిన టాటా, బిర్లా, ఎన్‌టీపీసీ, నాల్కో, మిథానీ మల్క్‌హోల్డింగ్స్‌ వంటి దిగ్గజ సంస్థలు  

వరుసగా మూడో ఏడాది సులభతర వాణిజ్య ర్యాంకుల్లో మొదటిస్థానంలో నిలిచిన ఏపీ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగ ప్రగతి 2022 సంవత్సరంలో ఊపందుకుంది. ముఖ్యంగా మే 22 నుంచి 26వ తేదీ వరకు సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. టాటా, బిర్లా, ఐటీసీ, నాల్కో, ఎన్‌టీపీసీ, మిథాని, టెక్‌ మహీంద్రా వంటి దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాయి.

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఈ ఏడాది నాలుగుసార్లు సమావేశమై రూ.1,66,919.71 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇందులో రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ రూ.43,143 కోట్లతో సోలార్‌ ప్యానల్స్‌ తయారీ, కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్‌ ఫార్మా యూనిట్, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్, రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఫ్యాక్టరీ, రూ.560 కోట్లతో నెల్లూరులో క్రిభ్‌కో బయో ఇథనాల్, రాష్ట్రంలో వివిధ చోట్ల అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్స్‌ వంటివి ఉన్నాయి.

మే నెలలో సీఎం జగన్‌ దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం పర్యటన సందర్భంగా గ్రీన్‌ ఎనర్జీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్‌ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేసిన క్లోర్‌ ఆల్కాలిక్‌ (కాస్టిక్‌ సోడా) తయారీ యూనిట్‌ను కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఏప్రిల్‌ 21న ప్రారంభించారు.

జనవరి 12న గుంటూరులో ఐటీసీ వెల్‌కమ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్, నవంబర్‌ 11న ఐటీసీకి చెందిన స్పైసెస్‌ పార్కును సీఎం ప్రారంభించారు. జూన్‌ 23న తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్‌టెక్, డిక్సన్‌ వంటి కంపెనీలను సీఎం ప్రారంభించడం ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఆగస్టు 16న జపాన్‌ టైర్ల దిగ్గజ సంస్థ యకహోమా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,200 కోట్ల­తో ఏర్పాటు చేసిన హాఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించి­న సులభరత వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మూడో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. 

విషాద సంఘటన 
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దుబాయ్‌ పర్యటనలో రూ.5,100 కోట్ల విలువైన పెట్టుబడులు కుదుర్చుకు వచ్చిన కొద్దిరోజులకే ఫిబ్రవరి 21న హఠాన్మరణం పొందడం రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని కుదిపేసింది. అనంతరం మంత్రివర్గ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు.   

మరిన్ని వార్తలు