ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్‌ సీపీ మెగా జాబ్‌ మేళా 

5 May, 2022 09:25 IST|Sakshi
జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న  మంత్రులు అంబటి, కారుమూరి, విడదల, కలెక్టర్‌ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి     

కోస్తా జిల్లాల ఉద్యోగార్థులకు సువర్ణావకాశం

175కిపైగా కంపెనీల భాగస్వామ్యం

 ఇప్పటి వరకు 90వేల మంది రిజిస్ట్రేషన్‌

25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

సాక్షి, ఏఎన్‌యూ: జన క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్‌ సీపీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఆ పార్టీ యువతరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు నాందిపలికింది. నిరుద్యోగులతోపాటు కోవిడ్‌–19 విపత్కర పరిస్థితుల్లో పలు రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారికి అవకాశాలను చేరువచేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది.  

భారీ స్పందన  
ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి  90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.  జాబ్‌మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ కోసం 8985656565 ఫోన్‌ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్‌ అడ్రస్‌కు రెజ్యూమ్‌ పంపవచ్చు. 

కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు  
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్‌యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు.   


ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు 
జాబ్‌మేళా నిర్వహణకు ఏఎన్‌యూలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్‌ బ్లాక్‌ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్మీడియెట్‌ చదివిన వారికి ఒక బ్లాక్‌లోనూ, డిగ్రీ, పీజీ కోర్సులకు మరో భవనంలోనూ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల వారికి ఇంకో భవనంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీనికోసం ఈ భవనాల్లోని 100కుపైగా గదులను ఇప్పటికే సిద్దం చేశారు. 

500 మంది వలంటీర్ల నియామకం 
మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులకు సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్‌ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్‌కు ఆన్‌లైన్‌ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు.
చదవండి:‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’ 

విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్‌ సౌకర్యం
నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్‌ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి.  జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. 

యువత కోసమే..
నరసరావుపేట రూరల్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్‌  మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు.  బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన మెగా జాబ్‌ మేళా వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కారుమూరి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసమే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, కలెక్టర్‌ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరి సహకారంతో విజయవంతం చేస్తాం... 
జాబ్‌మేళా ఏర్పాట్లకు సహకారం అందించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖలూ పూర్తి సహకారం అందిస్తున్నాయి.  కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరి సహకారంతో జాబ్‌మేళాను విజయవంతం చేస్తాం. 
– ఎ హర్షవర్ధన్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జాబ్‌మేళా పర్యవేక్షకులు 

మరిన్ని వార్తలు