కర్నూలు మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.50,618..

21 Mar, 2023 10:53 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిర్చి ధర బంగారంతో పోటీగా పెరుగుతోంది. ఈ నెల 18న గరిష్టంగా క్వింటా మిర్చి ధర రూ.48,699లు పలకగా, దానిని అధిగమిస్తూ సోమవారం రికార్డు స్థాయిలో రూ.50,618లకు చేరింది. వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మోహన్‌ అనే రైతు క్వింటా మిర్చిని మార్కెట్‌కు తెచ్చారు.

మార్కెట్‌లో 309 లాట్‌లు ఉండగా.. మోహన్‌కు చెందిన లాట్‌కు రూ.50,618 ధర లభించింది. మద్దూరుకు చెందిన ప్రవీణ్‌ అనే రైతు తీసుకొచ్చిన మిర్చి క్వింటా రూ.49,699లు పలికింది. కర్నూలు మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటాకు కనిష్టంగా రూ.3,519, గరిష్టంగా రూ.50,618, మోడల్‌ ధర రూ.20,589లు చొప్పున నమోదైంది.

రోజురోజుకూ ధర అనూహ్యంగా పెరుగుతుండటంతో గోడౌన్‌లలో నిల్వ చేసిన మిర్చిని రైతులు పెద్దఎత్తున మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మిర్చి ధరలు 2021–22 నుంచి ఆశాజనకంగా ఉండటంతో 2022–23లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు.
చదవండి: చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు

మరిన్ని వార్తలు