అక్రమ కట్టడాలకు ‘యాప్‌’తో అడ్డుకట్ట

12 Oct, 2020 20:10 IST|Sakshi

ప్రత్యేకంగా ‘యూసీఐఎంఎస్‌’ యాప్‌ రూపొందించిన పురపాలక శాఖ

వార్డు సచివాలయం స్థాయిలోనే చెక్‌

ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ 

వెనువెంటనే జరిమానా, జప్తు లేదా కూల్చివేత

దేశంలోనే తొలిసారిగా వినూత్న విధానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాల దందాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. సాంకేతిక పరిజ్ఞానంతో వార్డు సెక్రటేరియట్‌ వ్యవస్థ ద్వారా అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ‘అన్‌ ఆథరైజ్డ్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (యూసీఐఎంఎస్‌) పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ విధానం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ యాప్‌ సహకారంతో రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సం‍స్థలు, 17 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అక్రమ, అనధికార నిర్మాణాలకు చెక్‌ పెట్టనున్నారు. వార్డు సచివాలయ స్థాయి నుంచి పురపాలక శాఖ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టరేట్‌ స్థాయి వరకు ఈ యాప్‌ అనుసంధానమై ఉంటుంది. దీనిపై ఇప్పటికే 3,775 వార్డు సచివాలయాల్లో ప్రణాళిక కార్యదర్శులకు అవగాహన కల్పించారు. త్వరలో ఈ యాప్‌ను అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు. 

యాప్‌ పనితీరు ఇలా..

  • మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఏటా సగటున 40 వేల వరకు అక్రమ, అనధికార, అనుమతులకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. వీటికి చెక్‌ పెట్టేందుకు భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
     
  • వార్డు సచివాలయాల్లోని ప్రణాళిక కార్యదర్శులు తమ పరిధిలో ఎక్కడైనా అనధికార, అక్రమ నిర్మాణం జరుగుతోందన్న సమాచారం వస్తే అక్కడికి వెళ్లి ‘యూసీఐఎంఎస్‌’ యాప్‌ ద్వారా వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు.
     
  • అనధికార నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘన, ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలు అనే మూడు అంశాల్లో  సంబంధిత నిర్మాణం ఏ కేటగిరీ కిందకు వస్తుందో గుర్తించి వివరాలు నమోదు చేస్తారు. నాలుగు కోణాల్లో మొబైల్‌తో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ సమాచారం మున్సిపాలిటీలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, రాజధానిలోని టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టరేట్‌కు చేరుతుంది.
     
  • అధికారులు వెంటనే ఆ నిర్మాణాన్ని నిలిపి వేయడంతోపాటు ఇతర చర్యలకు సిఫార్సు చేస్తారు. నిర్మాణ దారునికి నోటీసు జారీ చేస్తారు. విషయ తీవ్రతను బట్టి నిర్ణీత సమయంలో చార్జిషీట్‌ నమోదు చేసి.. అనుమతులకు ఫీజు, జరిమానా విధించడమో లేదా నిర్మాణాన్ని జప్తు చేయడమో.. కూల్చి వేయడమో జరుగుతుంది. 

సామాన్యులకు ప్రయోజనం 
అక్రమ, అనధికార నిర్మాణాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో కొనుగోలుదారులు మోసపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయం కోల్పోతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దాంతో అక్రమ కట్టడాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. 
 - వి.రాముడు, డైరెక్టర్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, పురపాలక శాఖ

మరిన్ని వార్తలు