AP: ‘ఫ్యామిలీ డాక్టర్‌’ వస్తున్నారు!

30 Jul, 2022 03:35 IST|Sakshi

ఎస్‌ఓపీ రూపొందించిన వైద్య ఆరోగ్య శాఖ

ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు 

రోజు మార్చి రోజు ఒక్కో వైద్యుడు గ్రామాల్లో వైద్య సేవలు 

104 ఎంఎంయూ వద్ద మధ్యాహ్నం వరకు ఔట్‌ పేషంట్‌ సేవలు 

మధ్యాహ్నం నుంచి హోమ్‌ విజిట్స్‌ 

అందరికీ వైద్య సేవలందేలా వైద్య సిబ్బందికి బాధ్యత అప్పగింత

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం అమలుకు  వైద్య, ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌), పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్‌ఓపీలో పొందుపరిచారు.

ఎస్‌ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 

రోజంతా గ్రామంలోనే..
రాష్ట్ర వ్యాప్తంగా 1142 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో భాగంగా ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు/విలేజ్‌ క్లినిక్‌లను విభజిస్తున్నారు. ఏ రోజు ఏ సచివాలయం/విలేజ్‌ క్లినిక్‌ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైమ్‌ టేబుల్‌ వేస్తున్నారు.

దాని ఆధారంగా ఒక్కో వైద్యుడు రోజు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీహెచ్‌సీ వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లోనే అందుతాయి. గ్రామాలకు వెళ్లే వైద్యుడు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌తో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలోనే ఉంటాడు.

అతనితో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లతో కూడిన బృందం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రారంభంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక సారి సందర్శన ఉంటుంది. తర్వాత నెలలో రెండు సార్లు 104 ఎంఎంయూ సందర్శించేలా సేవలు విస్తరిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా 432 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. 

తొలుత ఓపీ.. తర్వాత హోమ్‌ విజిట్స్‌
కొన్ని గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంలో ఉన్నందున ఓపీ 104 వాహనాల వద్దే ఉంటుంది.  క్లినిక్స్‌ నిర్మాణం పూర్తయ్యాక వాటి వద్దే ఓపీ నిర్వహిస్తారు.

మెడికల్‌ ఆఫీసర్‌ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్‌ సేవలు అందిస్తారు. బీపీ, షుగర్, ఇతర నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు రెగ్యులర్‌ చెకప్‌ చేస్తారు. 

గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తన పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అన్ని యాంటీనేటల్, పోస్ట్‌నేటల్‌ చెకప్స్‌ జరిగేలా చూస్తారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తిస్తారు.  

నవజాత, శిశు సంరక్షణ సేవలు అందిస్తారు. అంగన్‌వాడీ సెంటర్‌లు సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన వైద్య సేవలు చేస్తారు. 

పిల్లల్లో జబ్బులు, ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు.  

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వైద్యుడు హోమ్‌ విజిట్స్‌ చేస్తారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన రోగుల ఆరోగ్య పరిస్థిని ఫాలో అప్‌ చేస్తారు. 

మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు.  క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్‌ కేర్‌ సేవలు అందిస్తారు. 

పాఠశాలల్లో విద్యార్థులకు జనరల్‌ చెకప్, అనీమియా, ఇతర సమస్యలకు వైద్యం చేస్తారు. పిల్లల్లో అనీమియా నియంత్రణకు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ పంపిణీ అమలును పర్యవేక్షిస్తారు. 

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లోని ఎంఎల్‌హెచ్‌పీ తన పరిధిలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారు.  టెలీ మెడిసిన్‌ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ సేవలను అందిస్తారు. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్‌ వంటి ఎన్‌సీడీ జబ్బుల నిర్ధారణకు స్క్రీనింగ్‌ చేపడతారు. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు. 

ఏఎన్‌ఎం గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రెఫర్‌ చేసిన ఆరోగ్య శ్రీ కేసులను ఫాలోఅప్‌ చేస్తారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు పొందడానికి హాజరవ్వాల్సిన యాంటీనేటల్, పోస్ట్‌ నేటల్‌ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 

ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య సేవలు పొందడానికి ప్రజలను ఆశ వర్కర్‌ సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాల సందర్శన కోసం మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు.   

మరిన్ని వార్తలు