వైద్య రంగానికి దిక్సూచి.. మెడ్‌టెక్‌ జోన్‌

13 Jan, 2023 03:56 IST|Sakshi
ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌

ప్రపంచ స్థాయి సంస్థలకు కేరాఫ్‌గా మారిన జోన్‌

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌.. వైద్య ఉపకరణాల తయారీలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు, సంస్థలకు కూడా కేరాఫ్‌గా మారింది. వైద్య రంగానికే దిక్సూచిలా మారుతోంది. కోవిడ్‌ సమయంలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ని తయారు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న మెడ్‌ టెక్‌ జోన్‌ అదే జోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్‌ ఇటీవల ఇక్కడ ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రపంచస్థాయి గామా రేడియేషన్‌ సెంటర్‌ కూడా ప్రారంభమైంది. ఇలాంటి విప్లవాత్మక సంస్థలు ఎన్నో ఈ జోన్‌లో చోటు కోసం క్యూ కడుతున్నాయి.

కరోనాను ఎదుర్కోవడంలో..
కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో ఆ మహ­మ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన కిట్లు, ఉపకరణాలను మెడ్‌టెక్‌ జోన్‌ అందించింది. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్‌ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది.  ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకర­ణాలను అందించింది. ప్రతి రోజూ 100 వెంటిలేటర్లు, 500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10 లక్షల ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు తయారు చేసేది. దీంతో ప్రపంచం దృష్టి మెడ్‌టెక్‌ జోన్‌పై పడింది.

పరిశోధనలు, ఆవిష్కరణలు: ప్రస్తుతం మెడ్‌టెక్‌ జోన్‌లో 100 సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు, ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ జోన్‌ ముందు వరసలో నిలుస్తోంది. ఎమ్మారై పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాల్ని తక్కువ కాలంలోనే అందించేలా సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెట్స్‌ని ఇటీవలే తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 టెస్లా ఎమ్మారై కండక్టింగ్‌ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు.

ఇక్కడ మాత్రం మరింత శక్తివంతమైన సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెట్స్‌ని తయారు చేస్తున్నారు. ఎమ్మారైని తయారు చేసే సంస్థకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుండటం విశేషం. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు టెలీ రేడియాలజీ సొల్యూషన్స్‌ (టీఆర్‌ఎస్‌) కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 70 శాతానికిపైగా గ్రామీణ ప్రాంత ప్రజలు  రేడియాలజీ సేవల కోసం పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు.

ప్రపంచస్థాయి గామా రేడియేషన్‌ సెంటర్‌
అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈ­ఆర్‌బీ) మార్గదర్శకాల మేరకు మెడ్‌ టెక్‌లో ప్రపంచస్థాయి గామా రేడియేషన్‌ సెంటర్‌ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక రేడియేషన్‌ సెంటర్‌ని ఏ­ర్పా­టు చేశారు. వైద్యం, వ్యవసాయం, సీ ఫుడ్‌­లో నాణ్యమైన ఎగుమతులకు గామా రేడి­యేషన్‌ సేవల కేంద్రం ఉపయోగప­డు­తుంది. ఇందుకోసం కోబాల్ట్‌–60ని ఉపయో­గిం­చను­న్నట్లు మెడ్‌టెక్‌ జోన్‌ ప్రతినిధులు తెలిపారు.

దిగుమతుల నుంచి ఎగుమతులకు..
గతంలో భారత్‌.. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది. ఎప్పుడైతే.. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఉపకరణాల ఉత్పత్తి జోరందుకుందో.. ఈ పరిస్థితి మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కోట్లాది రూపాయల వి­లువైన అత్యాధునిక యంత్రాలు ఇక్కడే తయార­వు­తున్నాయి. ఎమ్మారై యంత్రాలను దిగుమతి చేసు­కోవాలంటే రూ.4.5 కోట్లు ఖర్చవుతుంది.

మెడ్‌­టెక్‌లో కేవలం రూ.98 లక్షలకే వీటిని తయారు చేస్తు­న్నారు. దీనివల్ల అత్యాధునిక ఎమ్మారై స్కా­నర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక్కో యంత్రా­నికి దాదాపు రూ.3.5 కోట్లు ఆదా అవుతుంది. త­ద్వారా ఎంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవు­తుంది. మరిన్ని ఆస్పత్రులు ఎమ్మారై యంత్రా­లను ఏ­ర్పా­టు చేసుకొనే వెసులుబాటు కలిగింది. 

ప్రపంచంలోనే తొలిసారిగా.. హెల్త్‌ క్లౌడ్‌
వైద్య పరికరాల పరిశ్రమల అవసరాల్ని తీర్చేందుకు డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్‌టెక్‌ జోన్‌ మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌తో కలిసి కొద్ది నెలల క్రితం ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించి హెల్త్‌ క్లౌడ్‌ని రూపొందించింది. డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అలయన్స్, రేడియాలజీ ఇమేజింగ్‌ సర్వీసులు, హెల్త్‌ డిజిటల్‌ డేటా.. ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానించేలా డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు హెల్త్‌ కేర్‌ సౌకర్యాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ హెల్త్‌ క్లౌడ్‌ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందనున్నాయి.

ఎంఎస్‌ఎంఈతో ఒప్పందం
ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్‌ఎంఈతోనూ మెడ్‌­టెక్‌ జోన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలోని ఎంఎస్‌ఎంఈల మధ్య పోటీ­తత్వం పెంచేందుకు ఈ ఒప్పందం ఉప­యు­క్తం కానుంది. ఇలా.. విభిన్న రీతుల్లో విప్ల­వాత్మకమైన వైద్య పరికరాల్ని ప్రపంచానికి అందించేలా.. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్‌టెక్‌ జోన్‌ కృషి చేస్తోంది. 

మరిన్ని వార్తలు