Samajika Nyaya Bheri Bus Yatra: సమసమాజం సాకారం

29 May, 2022 03:53 IST|Sakshi
పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన సామాజిక న్యాయభేరి సభకు హాజరైన జనసందోహం

సీఎం జగన్‌ చిత్తశుద్ధి వల్లే రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం 

70 శాతం మంత్రి పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు 

రాజకీయ సాధికారత దిశగా దృఢ సంకల్పంతో సీఎం నిర్ణయాలు 

సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రులు

దారిపొడవునా మండుటెండలో ఘనస్వాగతం.. పల్నాడులో పోటెత్తిన జనవాహిని 

నరసరావుపేట నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాడేపల్లిగూడెం: సమసమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో మంత్రులు పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దృఢ సంకల్పంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, 70 శాతం మంత్రి పదవులను ఆయా వర్గాలకే ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మహానాడు దూషణలే లక్ష్యంగా ఏడుపునాడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ‘జగన్‌ ముద్దు–బాబు వద్దు’ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బృందం చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర మూడో రోజైన శనివారం తాడేపల్లిగూడెం జిల్లా నుంచి ఏలూరు, గన్నవరం, విజయవాడ, గుంటూరు మీదుగా నరసరావుపేట వరకు సాగింది. మంత్రులు పలుచోట్ల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. నరసరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 44 డిగ్రీల మండుటెండలోనూ జనం పోటెత్తారు. యాత్ర పొడవునా ప్రజలు మంత్రులకు స్వాగతం పలికారు. 
నరసరావుపేటలో వేదికపై మంత్రులు 

బడుగు వర్గాలను పాతాళానికి తొక్కిన చంద్రబాబు: మంత్రి విడదల రజని
చంద్రబాబు పాలనలో బడుగు వర్గాలను పాతాళానికి తొక్కాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని విమర్శించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క రాజ్యసభ సభ్యత్వమూ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ మూడేళ్ల పాలనలో 8 రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే కేటాయించి సీఎం జగన్‌ సామాజిక న్యాయం పాటించారన్నారు. 

జగన్‌ ముద్దు.. చంద్రబాబు వద్దు: మంత్రి వేణు
సామాజిక న్యాయభేరితో కర్ణభేరీ మోగిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ చెప్పారు. బడుగు వర్గాలు ఉద్యమాలు చేయకుండానే ముఖ్యమంత్రి జగన్‌ వారికి ఉన్నత స్థితి కల్పించారన్నారు. శాసన మండలికి ఎస్సీని చైర్మన్‌ చేశారని చెప్పారు. చంద్రబాబు మహానాడు ఏడుపునాడుగా సాగుతోందన్నారు

చంద్రబాబు నిర్వహించింది నారా మహానాడు: మంత్రి కారుమూరి
చంద్రబాబు నిర్వహించింది ఎన్టీఆర్‌ మహానాడు కాదని, నారా మహానాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ లేకపోవటం సిగ్గుచేటన్నారు. మంత్రివర్గంలో అణగారిన  కులాలకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కే వారిని ఓట్లు అడిగే హక్కుందన్నారు. చంద్రబాబు ఎవరిని పోయి ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. 
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బస్సుయాత్రకు తరలివచ్చిన జనసందోహం 

అణగారిన వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా
అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి అంజాద్‌ బాషా చెప్పారు. బలహీన వర్గాల పరిపుష్టికి నవరత్నాలు అమలు చేశారన్నారు. డ్వాక్రా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేస్తే వైఎస్సార్‌ ఆసరాతో జగన్‌ ఆదుకున్నారని తెలిపారు.  2024లోనూ జగన్‌ సీఎం కావటం ఖాయమన్నారు. 

అది ఏడుపునాడు: మంత్రి అంబటి రాంబాబు 
రాష్ట్రంలో సామాజిక న్యాయం సాగుతోందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అధికారం లేదని  చంద్రబాబు, లోకేష్‌ ఏడుపుతో నిర్వహిస్తున్న మహానాడు ఏడుపునాడని ఎద్దేవా చేశారు. మహిళలతో బూతులు తిట్టించిన మహానాడు బూతులనాడని, ఆ బూతులను మహాభారతంలా విన్నట్లుగా విన్న  చంద్రబాబు దిగుజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. ఒక్కడే ఎన్నికలకు పోలేక అందరూ కలిసి రావాలని అన్ని పార్టీలను బ్రతిమలాడుకుంటున్నారని తెలిపారు. 


వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుది: మంత్రి జోగి రమేష్‌
బలహీన వర్గాలను వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ అంతు చూస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్‌ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని హితవు పలికారు. 

ఐక్యత కొనసాగాలి: మంత్రి పీడిక రాజన్నదొర
బడుగు బలహీన వర్గాల ఐక్యత కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతోందని, అందులో ఎక్కువ లబ్ధి పొందుతున్నది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక  చంద్రబాబు మహానాడులో మహిళలతో అసభ్యంగా మాట్లాడిస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

అపూర్వ స్పందన: మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం నుంచి బయల్దేరిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన  లభిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గత పాలకులు మేనిఫెస్టోలను పక్కన పెట్టారని, సీఎం జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి హామీలను పూర్తిగా అమలు పరుస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు హద్దు మీరి మాట్లాడితే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందన్నారు. 

అంబేడ్కర్‌ కోనసీమ పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలి: మంత్రి సురేష్‌
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూసి చంద్రబాబుకు గుండెల్లో వణుకు పుడుతోందన్నారు.

అన్ని వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ 
రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చిన మహానుభావుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకూ సంతృప్తికర న్యాయం చేశారన్నారు. మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసి గౌరవించారని తెలిపారు.

అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కింది: శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు
జగన్‌ పాలనలో అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కిందని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చెప్పారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తమకు జగన్‌ రాకతో మేలు జరిగిందన్నారు. ఎక్కడా గుర్తింపు లేకుండా ఉన్న 56 కులాలకు కార్పొరేషన్‌ పదవులు కేటాయించి జగన్‌ సామాజిక న్యాయం చేశారని చెప్పారు. జగన్‌ పాలన పది కాలాల పాటు ఉండాలని కోరుకుందామన్నారు.

యాత్రలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం, ఉషాశ్రీచరణ్,  తానేటి వనిత, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్,  ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి,  మహ్మద్‌ ముస్తఫా,  గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హెనీ క్రిస్టినా, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నంద్యాల నుంచి మొదలయ్యే యాత్ర అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది.  

బడుగువర్గాలకు గౌరవం కల్పించిన సీఎం జగన్‌: మంత్రి ధర్మాన 
వైఎస్సార్‌సీపీ వచ్చేంత వరకు రాష్ట్రంలో బడుగు వర్గాలు సరైన గౌరవాన్ని నోచుకోలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సమసమాజ స్థాపన చేయాలనే దృక్పధంతో వైఎస్‌ జగన్‌ 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతున్నారని చంద్రబాబు తన పార్టీ వారి చేత ప్రచారం చేయిస్తున్నాడని, సంపద సృష్టించేందుకు కారణమైన వారికే పంచిపెడుతున్నారని గుర్తు చేశారు.

జన్మభూమి కమిటీలు లాంటి బ్రోకర్లతో పనిలేకుండా పేదలందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ఇప్పటివరకు రూ.1.47 లక్షల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. బాబు 14 ఏళ్ల పాలనలో దోపిడీనే తప్ప ఇటువంటి మంచి చేయలేకపోయారని అన్నారు. టీడీపీ పాలనలో పసుపు చొక్కా వేసుకొని ఇంటిపై జెండా పెడితేనే పింఛను వచ్చేదన్నారు. పేదవారికి సాయం చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే బాబులాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారని హెచ్చరించారు. 

సామాజిక న్యాయ విప్లవం : మంత్రి మేరుగ 
ఏపీలో సామాజిక న్యాయం మహా విప్లవంలా ప్రారంభమైందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన  75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ నేత చేయలేని న్యాయాన్ని సీఎం జగన్‌ అందించారని తెలిపారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, బీసీ, కాపు, ఈబీసీ మహిళలకు మేలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల రాజ్యాంగ హక్కులను హరించారని విమర్శించారు. అమలాపురం అలజడులు చంద్రబాబు, పవన్‌ అడిన నాటకంలో భాగమేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు జగన్‌కు అండగా ఉండి సంక్షేమ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు