24 మంది మంత్రుల రాజీనామా

8 Apr, 2022 03:21 IST|Sakshi
గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాజీనామా లేఖల సమర్పణ

రెండున్నరేళ్ల కంటే ఎక్కువ కాలం అవకాశం ఇచ్చినందుకు మంత్రుల కృతజ్ఞతలు 

సంక్షేమాభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం కల్పించినందుకు ధన్యవాదాలు 

సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే మంత్రివర్గంలోకి తీసుకున్నానన్న సీఎం 

అందరూ సమర్థంగా పనిచేశారని ప్రశంసలు 

వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే 

అప్పుడు మళ్లీ మీరే మంత్రుల స్థానాల్లో కూర్చుంటారని భరోసా 

మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లా అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా అవకాశం 

సాక్షి, అమరావతి: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పారని.. కానీ తమకు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్‌కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.34 లక్షల కోట్లు జమ చేయడం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవడంలో తమను కూడా భాగస్వాములు చేయడాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు.

రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధి.. అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే 2019, జూన్‌ 8న మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాను. వెయ్యి రోజులు మంత్రులుగా అద్భుతంగా పనిచేశారు. రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నదే నా ఆలోచన.. 700 రోజులు పార్టీ కోసం పనిచేయండి. మంత్రులుగా మీలో కొందరిని మార్చి.. కొందరిని కొనసాగిస్తున్నంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసినట్టు కాదు. మంత్రులుగా పనిచేయడం కంటే.. ప్రజల్లో ఉంటూ పార్టీకి సేవ చేయడాన్నే నేను గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో  మీరు పార్టీని గెలిపించుకురండి.. మళ్లీ మీరు ఇవే స్థానాల్లో కూర్చుంటారు’ అంటూ ఉద్భోదించారు. దీనిపై మంత్రులంతా బల్లచరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తామని.. 2024 ఎన్నికల్లో పార్టీని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. 

మీరంతా అద్భుతంగా పనిచేశారు.. 
ఈ సందర్భంగా మంత్రులుగా మీరంతా అద్భుతంగా పనిచేశారని సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ప్రశంసించారు. ‘మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని 2019 ఎన్నికల్లో ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం’ అని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో.. మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నామని చెప్పారు. ఇలాంటప్పుడు 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా 2024లో ఎందుకు రావు!? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లగలిగి.. ప్రజల మధ్య ఉంటే మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు సూచించారు.  
 
జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా.. 
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. మంత్రులుగా తప్పించినవారికి భవిష్యత్తులో ఏమాత్రం గౌరవం తగ్గకుండా చూస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ బాధ్యతలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగానూ అవకాశమిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయడం జిల్లా అభివృద్ధి మండళ్ల బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మీ అనుభవాన్ని, సమర్థతను వినియోగించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని వారిని సీఎం కోరారు. 2024లో జిల్లాల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసేలా చూడాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11న మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.     

>
మరిన్ని వార్తలు