ఆంధ్ర మిర్చి రైతుకు అండగా...

1 Jul, 2022 17:27 IST|Sakshi

చిన్న, సన్నకారు రైతులకు సాధికారితను అందించడంతో పాటు అనూహ్య  మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడేందుకు వెజిటబుల్‌ సీడ్స్‌ ఉత్పత్తిదారు సిన్జెన్టా ఇండియా ముందుకొచ్చింది. దీనిలో భాగంగా గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో  ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. అంతేకాకుండా మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

ఈ బీమా పధకాన్ని ప్రారంభించిన సందర్భంగా సిన్జెన్టా ఇండియా చీఫ్‌ సస్టెయినబిలిటీ ఆఫీసర్‌ డాక్టర్‌ కె సీ రవి మాట్లాడుతూ ‘‘ చిన్న కమతాల రైతులకు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. దీనిద్వారా వారు తమ  ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది. ఈ పథకం  మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గొప్ప తోడ్పాటుగా నిలువనుంది. దాదాపు 80% ఎండుమిర్చి వేలం గుంటూరు ఏపీఎంసీని పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి సరైన వేదిక’’ అన్నారు. 

‘‘తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ను తిరిగి పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. అయితే మార్కెట్‌లో డిమాండ్‌–సరఫరా నడుమ అంతరాల కారణంగా మార్కెట్‌లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు వల్ల రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి.  అలాంటి పరిస్థితుల్లో తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంటుందంటేనే రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు.    స్థిరమైన మార్కెట్‌ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు’’ అని ఏఐసీ సీఎండీ ఎంకె పొద్దార్‌  అన్నారు.

మరిన్ని వార్తలు