దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్‌

8 Sep, 2021 03:19 IST|Sakshi
నిట్‌కు వచ్చిన సీఈజీఆర్‌ అవార్డు

 అవార్డు అందజేసిన సీఈజీఆర్‌ (ఢిల్లీ) సంస్థ 

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌కు 2021 సంవత్సరానికి గాను దక్షిణ భారతదేశ ఉత్తమ సంస్థ అవార్డు దక్కింది. వర్చువల్‌ పద్ధతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ గ్రోత్‌ అండ్‌ రీసెర్చ్‌ (సీఈజీఆర్‌) (ఢిల్లీ) సంస్థ నుంచి అవార్డును నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు అందుకున్నారు. సీఈజీఆర్‌ సంస్థ 15వ రాష్ట్రీయ శిక్ష గౌరవ్‌ పురస్కార్‌ వేడుక సందర్భంగా విద్యా నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల్లో అత్యుత్తమ కృషికి గాను నిట్‌కు ఈ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా సీఎస్‌పీ రావు మాట్లాడుతూ.. ఏపీ నిట్‌ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇనిస్టిట్యూట్‌ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నూతన విద్యా విధానం–2020 మార్గదర్శకాల ప్రకారం 2020–21 విద్యాసంవత్సరం నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) పాఠ్యాంశాలను సవరించామన్నారు. నిరంతర మద్దతు ఇస్తున్నందుకు విద్యా మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దినేష్‌ పి.శంకరరెడ్డి మాట్లాడుతూ.. నిట్‌లో నిర్మాణాలను ప్రపంచస్థాయి సదుపాయాలతో రికార్డు సమయంలో చేపట్టడానికి డైరెక్టర్‌ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ అవార్డు ఇచ్చిన ప్రేరణతో భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు దాటడానికి ప్రయత్నిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు