Aquaculture: ఆక్వాలో ఆంధ్రాదే అగ్రస్థానం

12 Mar, 2022 16:26 IST|Sakshi

రాష్ట్రంలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం  

ఏపీ సీడ్‌ యాక్టుతో పెరిగిన నాణ్యత ప్రమాణాలు 

విద్యుత్‌ సబ్సిడీతో రూ.కోట్లలో రైతులకు లబ్ధి  

ఇకపై రిజర్వాయర్లలోనూ రొయ్య పిల్లలు విడుదల

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆక్వారంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ పరుగులు పెడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల్లో  నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా సాగుకు విద్యుత్‌కు సబ్సిడీ ప్రకటించారు. ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ యాక్టు, ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్టు – 2020 ద్వారా నాణ్యమైన ఉత్పత్తులకు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా పరిశ్రమ తారాజువ్వలా దూసుకుపోతోంది.

974 కిలోమీటర్ల తీరప్రాంతంలో .. 
రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. దేశంలో ఉత్పత్తవుతున్న మత్స్య సంపదతో పోలిస్తే 31 శాతం వాటాను ఏపీ ఆక్రమించింది. వెనామీ రొయ్యలు, పండుగప్ప రకం చేపలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. ఒక్క కృష్ణా జిల్లాలో 1.80లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇప్పటి వరకూ రిజర్వాయర్లలో చేప పిల్లలను మాత్రమే వదిలేవారు. ఈ ఏడాది నుంచి మత్స్యకారుల వేట నిమిత్తం రొయ్య పిల్లలను సైతం విడిచిపెడుతున్నారు.

ఏటేటా పెరుగుతున్న ఉత్పత్తులు.. 
ఏపీ నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో  రూ.19 వేల కోట్ల విలువైన 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయని మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా) ప్రకటించింది. దిగుబడుల విషయానికొస్తే 2018–19లో 13.42 లక్షల టన్నులు, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు పెరిగాయి. ఏపీ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం – 2020, ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టం 2020ను ప్రవేశపెట్టింది. ఈ చట్టాల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు, మేతలకు అవకాశం ఏర్పడుతున్నది. ఈ చట్టాల ద్వారా ఆక్వా రైతులు రెన్యూవల్, నూతన లైసెన్సులు పొందాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు లైసెన్సులు పొందారు.

అండగా ప్రభుత్వం..  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆక్వా సాగుకు విద్యుత్‌ సబ్సిడీ కల్పించింది. రాష్ట్రంలో 60,472 ఆక్వా విద్యుత్‌ సర్వీసులకు యూనిట్‌ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.332 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. సచివాలయ స్థాయిలో ఈ–ఫిష్‌ బుకింగ్‌ చేసి, వైఎస్సార్‌ మత్స్య పొలంబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కలిగిస్తున్నది. ఇవే కాకుండా వేట నిషేధ సమయంలో భృతి, డీజిల్‌పై సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా, ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది.

ఆక్వాకు ఊపిరి పోశారు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రంగానికి ఊపిరిపోశారు. కరోనా సమయంలోనూ ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ముఖ్యంగా ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందించడం వల్ల డీజిల్‌ ఖర్చులు తగ్గాయి. దీంతో లక్షల్లో రైతులకు ఆర్థిక ఊరట కలిగింది.  
– మంగినేని రామకృష్ణ, ఆక్వా రైతు, కైకలూరు  

దిగుబడులు పెరిగాయి..
ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తోంది. అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యమైన సీడు, ఫీడు సరఫరాకు చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఏటేటా ఆక్వా ఉత్పత్తులు పెరుగుతున్నాయి.  ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా అగ్రస్థానంలో 
నిలిచింది.
 – లాల్‌ మహమ్మద్,  జాయింట్‌ డైరెక్టరు, మత్స్యశాఖ, కృష్ణాజిల్లా   

మరిన్ని వార్తలు