మా భూభాగంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దు..

22 Jul, 2021 03:24 IST|Sakshi
సనొలకుటి గ్రామంలో పర్యటిస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు

ఏపీ అధికారులకు తెలియజేసిన ఒడిశా అధికారులు  

రాయగడ: ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రాయగడ సమితిలోని సనొలకుటి గ్రామానికి కూతవేటు దూరంలో విజయనగరం జిల్లాకు చెందిన బీరపాడు పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ ప్రజలు రాకపోకలకు ఒడిశా భూభాగంలోని సనొలకుటి గ్రామం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నెలల కిందట ఏపీ అధికారులు సనొలకుటిలో వంతెన, రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు మెరుగవుతాయని మన అధికారులు చెబుతుండగా.. ఒడిశా అధికారులు మాత్రం దీనికి అంగీకరించలేదు. తమ భూభాగంలో ఏపీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

వంతెన, రోడ్డు పనులకు అనుమతివ్వాలని విజయనగరం అధికారులు ఈ నెల 16న రాయగడ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం రాయగడ తహసీల్దార్‌ ఉమాశంకర్‌ బెహరా, బీడీవో లక్ష్మీనారాయణ సోబొతొ నేతృత్వంలో రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు సనొలకుటిలో బుధవారం పర్యటించారు. ఏపీ అధికారులు కూడా సరిహద్దు గ్రామానికి వెళ్లారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు. అనంతరం గ్రామ పరిస్థితిపై కలెక్టర్‌ సరోజ్‌కుమార్‌ మిశ్రాకు నివేదిక సమర్పించారు. ఒడిశాకు సంబంధించిన భూభాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ఏపీ అధికారులకు కలెక్టర్‌ లేఖ ద్వారా బదులిచ్చారు. ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాలైనా తామే (ఒడిశా ప్రభుత్వం) చేపడతామని లేఖలో తెలియజేసినట్టుగా తెలిసింది.  

మరిన్ని వార్తలు