4 దేశాలకు ఏపీ అధికారులు

3 Mar, 2022 04:41 IST|Sakshi

పోలండ్, హంగేరి, రొమేనియా, స్లొవేకియాలకు పయనం 

విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 586 మంది విద్యార్థుల వివరాల సేకరణ  

ఆ వివరాలను విదేశాంగ శాఖకు అందించిన ప్రభుత్వం 

సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి, విశాఖపట్నం: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన క్షేమంగా ఇక్కడికి చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్‌లో రోజు రోజుకు యుద్ధ భయం పెరుగుతుండటం, కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి మరణంతో రాష్ట్రం అప్రమత్తమైంది. విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావడానికి ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. హంగేరీకి ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు, ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి ఎస్‌.వెంకట్, పోలండ్‌కు యూరప్‌ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రరెడ్డి, రొమేనియాకు  ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆయా దేశాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపనున్నట్లు ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రుల ద్వారా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించడం ద్వారా వారిలో మనో ధైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బాధ్యతను స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. ఉక్రెయిన్‌లో సుమారు 586 మంది ఉన్నట్లు గుర్తించడమే కాకుండా, అందులో 555 మంది ఇళ్లకు అధికారులు స్వయంగా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. వీరందరి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధులకు పంపించడం ద్వారా వారిని వేగంగా స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఢిల్లీ చేరుకున్న 28 మంది విద్యార్థులు 
ఉక్రెయిన్‌ నుంచి 28 మంది ఏపీ విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వారందరికీ అధికారులు ఏపీ భవన్‌లో వసతి, భోజన సదుపాయం, రాష్ట్రానికి చేరుకోవడానికి రవాణా సదుపాయం కల్పించారు. న్యూఢిల్లీ నుంచి ఐదుగురు విద్యార్థులు బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో విజయవాడకు చెందిన కొర్రపాటి సాయిఆకాష్, షేక్‌ దలీషా, భవానిపురానికి చెందిన మైలవరపు శ్రవణ్‌ దీపక్‌కుమార్, తాడేపల్లికి చెందిన అల్లంశెట్టి భానుప్రకాష్, ఏలూరుకు చెందిన తూము ప్రణవ్‌స్వరూప్‌ ఉన్నారు.  మరో ఎనిమిది మంది విద్యార్థులు ఎయిరిండియా విమానంలో బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.  

>
మరిన్ని వార్తలు