సిరులు కురిపిస్తున్న ఆయిల్‌పామ్‌

16 Feb, 2023 05:52 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఆయిల్‌పామ్‌ రైతు పంట పండుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది ధర తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం ఏలూరు జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో పామాయిల్‌ సాగు తొమ్మిది జిల్లాల్లో ఉండగా.. అందులో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం మొత్తంతో పోలి్చతే జిల్లాలోనే సుమారు 50 శాతం ఉండటం విశేషం. గడిచిన నాలుగేళ్లలో ఏటా సగటున నాలుగు వేల ఎకరాల చొప్పున పామాయిల్‌ సాగు పెరుగుతూ వస్తున్నది.  

ప్రభుత్వ ప్రోత్సాహం.. 
ఉమ్మడి పశి్చమలో 1988లో ఆయిల్‌పామ్‌ సాగు జిల్లాకు పరిచయమైంది. 1992లో టీఎంఓపీ పథకం ద్వారా దీన్ని ప్రారంభించి పెదవేగి ఆయిల్‌ఫెడ్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో 1996 నుంచి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం ప్రారంభమైంది.  అధిక ఆదాయంతో పాటు అంతర పంటలకు అవకాశం ఉన్న ఆయిల్‌పామ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడంతో మెట్ట ప్రాంతంలో రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపారు.  ఆయిల్‌పామ్‌ కంపెనీల ద్వారా మొక్కలను సబ్సిడీపై రైతులకు అందించి హెక్టారుకు రూ.5,250 చొప్పున మొదటి నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుకు జమ చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2,16,192 ఎకరాల్లో ఈ ఏడాది ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. పామాయిల్‌ మొక్క ఇవ్వడం మొదలుకుని దిగుమతి వచ్చేవరకు అన్నీ ఆయిల్‌పామ్‌ కంపెనీలు చూస్తుండడం, సాగుకు సబ్సిడీలు ఉండడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతంలో ప్రధాన పంటగా మారిపోయింది.

ప్రతి ఏటా ముడిచమురు, పామాయిల్‌ ధరలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం, ఆయిల్‌ఫెడ్‌ కంపెనీలు కలిసి ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో (ఓఈఆర్‌) ప్రకారం ధర నిర్ణయిస్తాయి. గతేడాది అంతర్జాతీయంగా పామాయిల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23 వేలకు చేరింది. ఆయిల్‌పామ్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడంతో ప్రస్తుతం టన్ను రూ.13,400గా ఉంది.  మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా సాగు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావడం, ఐదో సంవత్సరం నుంచే దిగుబడి వస్తుండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఐదో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమై ప్రతి మొక్క 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. నీటి వనరులు మినహా ఎలాంటి నిర్వహణ ఖర్చులూ ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 

జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో... 
ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో 2,16,190 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగులో ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉందని, 3.12 లక్షల ఎకరాలు పామాయిల్‌ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉందని ఉద్యాన శాఖాధికారులు నిర్ధారించారు. దీనిలో 2.16 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది.  కామవరపుకోట, చింతలపూడి, టి.నర్సాపురం, ద్వారకాతిరుమల మండలాల్లో ఇది అధికం. జిల్లాలో నవభారత్‌ ఆగ్రో, 3 గోద్రేజ్‌ ఆర్గో వెట్‌ కంపెనీలు, ఏపీ ఆయిల్‌ఫెడ్, పతంజలి ఫుడ్స్, ఫుడ్స్‌ అండ్‌ ప్యాడ్స్‌ తదితర కంపెనీల ద్వారా మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు కొనసాగుతోంది. ప్రతి కంపెనీకి కొన్ని మండలాలు కేటాయించి, వాటి పరిధిలో మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో కంపెనీయే నిర్వహించేలా చూస్తున్నారు.  

ఉద్యానవన శాఖ ద్వారా ప్రోత్సాహం 
ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, ఇతర సాంకేతిక పరమైన పరిష్కారాల కోసం ఆయి­ల్‌ఫెడ్‌ పరిశోధనా స్థానం కూడా ఉంది. సాగు­లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. 
– ఎ.దుర్గేష్‌, ఇన్‌చార్జి డీడీ  

మరిన్ని వార్తలు