ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు

27 Feb, 2021 07:47 IST|Sakshi

కరోనా విపత్తు వేళ ఉత్తమ పనితీరు

దేశంలో మూడో ర్యాంకు

ఐదో స్థానంలో తెలంగాణ

స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిపోర్ట్‌–2021 వెల్లడి 

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూలత చూపిన కరోనాకు ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్‌ సుస్థిర అభివృద్ధిని సాధించిందని ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రిపోర్ట్‌ – 2021’వెల్లడించింది. ఢిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’విడుదల చేసిన ఆ నివేదిక కరోనాను ఎదుర్కోవడంలో పలు రాష్ట్రాల పనితీరును విశ్లేషించింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి గమనం మందగించినా ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని, 2020లో సుస్థిర అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మూడో ర్యాంకు సాధించిందని నివేదిక వెల్లడించింది.

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై సామాజిక స్థితిగతులు, పిల్లల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపించిందని పేర్కొంది. భారత్‌ ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉందని పేర్కొనడం గమనార్హం. సుస్థిర అభివృద్ధి రేటులో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో భారత్‌కు 117 ర్యాంకు ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అయినప్పటికీ దేశంలో రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ...

ప్రతికూలతలోనూ ఉత్తమ పనితీరు.. 
కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆరి్థక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. అభివృద్ధి మందగించింది. అయినప్పటికీ దేశంలో ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయి. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొని మరీ సుస్థిర అభివృద్ధిని సాధించాయి. వాటిలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. కేరళ మొదటిస్థానం సాధించగా హిమాచల్‌ప్రదేశ్‌ రెండో స్థానం, నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. కరోనా వేళ సుస్థిర అభివృద్ధి సాధనలో బిహార్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, యూపీ చివరి స్థానాల్లో ఉన్నాయి. 

నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏపీ 
కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టిందని ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎని్వరాన్‌మెంటల్‌ రిపోర్ట్‌–2021’ప్రశంసించింది. వైద్య, ఆరోగ్య రంగాల సేవలను విస్తృతం, బలోపేతం చేయడంతోపాటు పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొంది.
రాష్ట్రంలో 1.47 కోట్లమంది పేదలకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు.  
2020 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు నెలకు రెండుసార్లు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టారు. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున నెలకు రెండుసార్లు అంటే నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఇలా మొత్తం మీద 35.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి పేదలను ఆదుకుంది.  
వైద్య, ఆరోగ్య సేవలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విస్తృతం చేసింది. వైద్య, ఆరోగ్య రంగంలో  మౌలిక వసతుల అభివృద్ధికి దాదాపు రూ.1,400 కోట్లు వెచ్చించింది. అందులో ల్యాబొరేటరీల ఏర్పాటుకే రూ.40 కోట్లు ఖర్చు చేయడం విశేషం.  
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కోవిడ్‌ను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది.  
2020 మార్చి నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబరేటరీ కూడా లేకున్నా యుద్ధ ప్రాతిపదికన ఏకంగా 14 వైరాలజీ ల్యా»ొరేటరీలను ఏర్పాటు చేసింది.  
రాష్ట్రంలో కొత్తగా దాదాపు 10 వేలమంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించింది.  
కొత్తగా 300 108 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 108 అంబులెన్స్‌లు 730కి చేరుకున్నాయి.  
రాష్ట్రంలో 104 వైద్య సేవల కోసం కొత్తగా 675 వాహనాలను ప్రవేశపెట్టింది.  
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలను అందించాయి. 2020 అక్టోబరు ప్రారంభం నాటికి కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి ఉపాధి అవకాశాలు పెరిగాయి.
చదవండి:
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!   
బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! 

 

మరిన్ని వార్తలు