అందుబాటులో 11 వేల బ్యాలెట్‌ బాక్సులు

27 Jan, 2021 17:17 IST|Sakshi
గుంటూరు ఇంచార్జి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికలు నాలుగు దఫాలుగా జరుగుతాయని, వీటిని పారదర్శకతతో నిర్వహిస్తామని గుంటూరు ఇంచార్జి‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల కోసం అధికారులకు ట్రైనింగ్ నిర్వహించామని ముప్పై వేల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బ్యాలెట్‌ పేపర్లను కూడా సిద్ధంగా ఉంచామని, 11 వేల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ను, లా అండ్ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. గతంలో జరిగిన ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలు, శాంతి భద్రతల అమలు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. (చదవండి: ఎన్నికల విధుల్లో పాల్గొనండి)

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  "ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి చోటా అవసరమైన బందోబస్తులను ఏర్పాటు చేశాం. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారికి స్పష్టమైన నిబంధనలు ఇచ్చాం. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సస్యలు తలెత్తినా 08632218089, 08632222750 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ నెస్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం" అని దినేష్‌ కుమార్‌ తెలిపారు. (చదవండి: ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం)

నెల్లూరు: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నాలుగు దఫాల్లో జరగనున్న ఎలక్షన్స్‌కు నిర్దిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 941 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 15 లక్షల 72 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారన్నారు. 390 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని, ఎన్నికల కోడ్‌కు లోబడి నడుచుకోవాలని కోరారు. 

కర్నూలు:  గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 193 గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్వం సిద్ధం చేశామన్నారు. ఈ ఎన్నికలపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. 10,212 పోలింగ్ స్టేషన్‌లు ఉండగా ఇందులో 377 సమస్యత్మక ప్రాంతాలు, 255 అతి సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. జిల్లాలో  35 ఎస్టీ, ఎస్సీ 191, బిసిలకు 256, జనరల్ 490,  జనరల్ మహిళ 497, జనరల్ మెన్ 476 గా మొత్తం 972 రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మొదటి విడత క్రింద 12 మండలాల్లోని 193 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 47 లక్షల బ్యాలెట్ పత్రాలను సిద్దం చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు