కళ్ల నిండా ఆనందం

28 Dec, 2020 05:22 IST|Sakshi
విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ ప్ల కార్డులతో మహిళలు

పట్టాలందుకున్న మహిళల కథలు ఎన్నెన్నో..

గత ప్రభుత్వ హయాంలో కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని వైనం

ఇప్పుడు అర్హులందరికీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రుణపడ్డామంటున్న లబ్ధిదారులు

ఊరూ వాడా ఒకటే చర్చ.. ఎక్కడ నలుగురు గుమిగూడి ఉన్నా అదే మాటలు.. ‘సుబ్బమ్మత్తా.. నీ స్థలం ఎక్కడ? రాములమ్మా నీ ప్లాటెక్కడే? శ్రీదేవొదినా నీక్కూడా స్థలం వచ్చిందా?’ అంటూ చర్చోపచర్చలు. పేర్లు మారినా మూడు రోజులుగా ఊరూరా ఇవే సంభాషణలు. దేశంలోనే ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల క్రితం ఏకంగా 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తామని ప్రకటించడం పట్ల లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో సొంతింట్లో ఉండగలమా.. అనే ప్రశ్న వేధించేదని, జగన్‌ పుణ్యమా అని ఇక ఆ ప్రశ్నకు తావేలేదని ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న జననేతకు వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టా అందుకుని సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన లబ్ధిదారుల మనోగతాలు ఇలా ఉన్నాయి.
– సాక్షి నెట్‌వర్క్‌
 
నా మనవడు జగన్‌ వల్లే సొంతిల్లు
మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్‌ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు.  వలంటీర్‌ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది.
– అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
 
12 సార్లు అర్జీ పెట్టినా రానిది..  

14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్‌ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మేలును ఎప్పటికీ మరువలేము.    
 – తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా

ఇన్నాళ్లూ తిరిగి తిరిగి అలసిపోయాం
సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్‌కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.  
– దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా

ఇప్పుడు ఆ భయం లేదు
పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎవరూ చేయని మేలును సీఎం జగన్‌ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలను చదివించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మళ్లీ రాలేదు. ఆ భయం లేదు. మా పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంటి స్థలం ఒక్కసారి దరఖాస్తు చేయగానే వచ్చింది.      
–  విజయలక్ష్మి, దండోరా కాలనీ, కడప
                        
చెప్పలేనంత ఆనందంగా ఉంది
బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్‌.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్‌ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం.    – సింహాద్రి సంతోషి,
ఎస్‌.కోట, విజయనగరం జిల్లా

టీడీపీ వాళ్లమైనప్పటికీ ఇల్లు మంజూరు
నా భర్త ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో వాచ్‌మెన్‌.  తిరుపతి శివజ్యోతి నగర్‌లో 40 ఏళ్లుగా కాపురం ఉంటున్నాం. అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేదు.  ఇప్పుడు వార్డు వలంటీర్‌ మా ఇంటికి వచ్చి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలివ్వాలని అడిగారు.  ఇన్నేళ్లు రాని ఇంటి పట్టా ఇప్పుడు వస్తుందా..? అనుకున్నాను. వలంటీర్‌ బలవంతంగా దరఖాస్తు చేయించింది. ఎవరి సిఫార్సు లేకుండానే ఇల్లు కూడా మంజూరవడంతో ఆశ్చర్యపోయాం. కొన్నేళ్లుగా టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న నాకు సీఎం జగన్‌ వల్లే స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఆనందంగా ఉంది. చిరకాల స్వప్నం నెరవేర్చారు.    
– ఎన్‌.వనజాక్షి, శివజ్యోతినగర్, తిరుపతి

నిజంగా ఇది పేదల ప్రభుత్వం
రోడ్డు పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాటాకు పాక వేసుకుని జీవిస్తున్నాం. భర్త చనిపోయి పదేళ్లవుతుంది. కూతురుతో కలసి పాకలోనే ఉంటున్నాం. టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం రూపాయికే ఇల్లు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇంటికి 20 ఏళ్లు పాటు బ్యాంకు రుణం చెల్లించాలని చెప్పితే జగన్‌ ఒక్క రూపాయి కడితే చాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇది పేదల ప్రభుత్వం.    
– మాకిరెడ్డి రమణమ్మ, నర్సీపట్నం మున్సిపాలిటీ, విశాఖ జిల్లా

అన్నలా ఆదుకుంటున్నాడు
పేదరికంతో కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇంటి స్థలం జగనన్న ఇచ్చారు. సొంత అన్నలా ఆడపడుచులను ఆదుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టిన వెంటనే ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పేదల గుండెల్లో సీఎం జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు.
– చందన భాస్కరలక్ష్మి, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా

ఇన్నాళ్లూ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు  
ఇప్పట్లో సొంత ఇల్లు వచ్చే అవకాశం లభిస్తుందని అనుకోలేదు. మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంటిలో నివాసముంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విడిగా అద్దె ఇంట్లో ఉండాలంటే మా ఆదాయం సరిపోవటం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం లేదా అని అనుకుంటున్న సమయంలో సీఎం జగన్‌ చెప్పడంతో ఇంటి స్థలానికి దరఖాస్తు పెట్టుకున్నా. నాకు ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. మా ఊహలను నిజం చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం.
– కె.శారద, చినగంజాం, ప్రకాశం జిల్లా

దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు
మాది చాలా పేదరికం. 20 ఏళ్ల క్రితం నా భర్తను కిడ్నీ వ్యాధి మహమ్మారి కబళించింది. పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నా. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా రాలేదు. కూలి డబ్బులు అద్దెలకు పోస్తే నా పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని మదన పడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చింది. వలంటీర్‌ వచ్చి ఇంటి స్థలం మంజూరవుతుందని వివరాలు తీసుకుని వెళ్లారు. తర్వాత నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే ఆనందం వేసింది. ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
– జోగి మోహిని, గుణుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా
 
ఇది మా కుటుంబానికి తొలి ఆస్తి
నా పేరు షేక్‌ నసీమా. 25 ఏళ్లుగా కుటుంబం మొత్తం అద్దె ఇంట్లోనే సర్దుకుపోతున్నాం. గతంలో ఎన్నోసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి పట్టా మంజూరు చేశారు. ఇది మా కుటుంబానికి చేకూరిన తొలి ఆస్తి. ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. సీఎం జగన్‌ చెప్పినవన్నీ చేసుకుపోతున్నాడు.
– షేక్‌ çనసీమా, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా

జీవితాంతం గుడిసె తప్పదనుకున్నాం
కూలికి పోతే తప్ప పూట గడవని పరిస్థితి. గ్రామంలో వేరేవారి స్థలంలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నాం. జీవితాంతం ఇదే గుడిసెలో కాలం ఈడ్చాలని అనుకునే వాళ్లం. నా భర్త హనుమంతప్ప, నలుగురు పిల్లలు ప్రతి రోజూ కూలికి పోయి జీవనం గడుపుతున్నాం. జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనే భావనతో ఉన్న మాకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. ఇంటి పట్టా అందుకున్న వేళ మా ఆనందం చెప్పలేం. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతుంటే సంతోషంతో మాటలు రావడం లేదు.
– అయ్యమ్మ, పెద్ద తుంబళం గ్రామం, కర్నూలు జిల్లా


చిత్తూరు జిల్లా ఊరందూరులో ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్‌


పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం తాళ్లకోడు వద్ద వేసిన లే అవుట్‌


విజయనగరం జిల్లా గుంకలాం వద్ద పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు

మరిన్ని వార్తలు