Covid Vaccine: ఉమ్మడి ఏపీలోనే డజను కంపెనీలు!

14 May, 2021 19:13 IST|Sakshi

సాక్షి– హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో, అమరావతి: భారత్‌ బయోటెక్‌ తన కోవాగ్జిన్‌ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో... ఈ వ్యాక్సిన్‌ తయారు చేసే సామర్థ్యం ఉన్న పలు దేశీయ కంపెనీలు ఇందుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి ఈ వ్యాక్సిన్‌ తయారీ అనేది మరీ అత్యాధునిక టెక్నాలజీ ఏమీ కాదని, బయోసేఫ్టీ లెవెల్‌ 3 స్థాయి అర్హత ఉన్న కంపెనీలు ఏవైనా దీన్ని తయారు చేయగలవని బయోటెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 

బయోసేఫ్టీ లెవెల్‌ 3 (బీఎస్‌ఎల్‌–3) అంటే ఒక దశ వరకూ లైవ్‌ వైరస్‌ను అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత డెడ్‌ వైరస్‌తో వ్యాక్సిన్‌ తయారవుతుంది. ఎలాంటి పరిస్థితిలోనూ గాలి నుంచి గానీ, నీటినుంచి గానీ వైరస్‌ బయటకు రాకుండా కాపాడే స్థాయిని బయో సేఫ్టీ లెవెల్‌–3గా పేర్కొంటారు. ఈ స్థాయి అర్హత, సామర్థ్యం ఉన్న కంపెనీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు డజను వరకూ ఉన్నాయనేది నిపుణుల మాట. వీరికి గనక అవకాశమిస్తే అతి తక్కువ కాలంలో అవసరమైనన్ని వ్యాక్సిన్లు తయారవుతాయని వారు చెబుతున్నారు.

 
ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీలో... 
దేశంలోని ప్రయివేటు ఫార్మా సంస్థల్లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌తోపాటు డాక్టర్‌ రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, గ్లాండ్‌ ఫార్మా,లతో పాటు బయొలాజికల్‌ ఇవాన్స్, జైడస్‌ క్యాడిలా, పనాసియా బయోటెక్, శాంతా బయో (సనోఫి), విర్కో ల్యాబ్స్, ఎమ్‌క్యూర్‌ వంటివి దీర్ఘకాలంగా పలు వ్యాక్సిన్లను తయారు చేస్తూనే ఉన్నాయి. చాలా సంస్థలు దేశీయ అవసరాలతోపాటు విదేశాలకూ వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నాయి. వీటిలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది కూడా. 

అరబిందో ఫార్మా వ్యాక్సిన్ల వార్షిక తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22 కోట్ల నుంచి జూలై నాటికి 70 కోట్ల డోసులకు పెంచుతోంది. వీటికి గనక తగిన విధంగా కోవాగ్జిన్‌ టెక్నాలజీ, ఫార్ములా బదిలీ అయితే ఇవి మిగతా వ్యాక్సిన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేసో, తగ్గించో కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, కొన్ని నెలల వ్యవధిలోనే మొత్తం దేశానికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని బయోటెక్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. 

ఐవీ లిక్విడ్స్‌ తయారు చేసే ప్లాంట్లతోపాటు ఇంజెక్టబుల్స్‌ యూనిట్లనూ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ ఫిల్లింగ్‌కు ఉపయోగించుకుంటే మేలని ‘లీ ఫార్మా’ ఎండీ ఆళ్ల వెంకటరెడ్డి సూచించారు. కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ సాంకేతిక బదిలీ ఈ పాటికే జరిగి ఉండాల్సిందని, ముఖ్యమంత్రి జగన్‌ చొరవను అభినందిస్తున్నామని చెప్పారాయన. పేటెంట్‌ హక్కుల బదిలీ జరగాలి. భారీ జనాభా ఉన్న భారత దేశంలో... సామర్థ్యమున్న కంపెనీలన్నిటినీ ఈ వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాముల్ని చేయాలని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయభాస్కర్‌ స్పష్టం చేశారు.

చదవండి: 
విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి

ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు