AP: ఈ-నామ్‌లో మనమే ముందు..

10 May, 2022 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ–నామ్‌ (ఎల్రక్టానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌).. రైతులకు గిట్టుబాటు ధర, వ్యాపారులకు నాణ్యమైన సరుకు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన వేదిక. జాతీయస్థాయిలో వ్యాపారపరంగా గుంటూరు మార్కెట్‌ కమిటీ మొదటి స్థానంలో నిలవగా,  ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఐదోస్థానంలో ఉంది. వేలంలో ఎక్కువమంది వ్యాపారులు పాల్గొన్నవాటిలో ఆదోని మార్కెట్‌ మొదటిస్థానంలో నిలిచింది.
చదవండి: వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్‌  

ప్రభుత్వ ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన ఫలితంగా ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులు, జాతీయస్థాయిలో వ్యాపారులు ఏపీ మార్కెట్ల ద్వారా క్రయవిక్రయాలకు పోటీ పడుతున్నారు. ఈ–నామ్‌ పరిధిలో జాతీయస్థాయిలో వెయ్యి మార్కెట్లు ఉండగా, రాష్ట్రంలో 33 మార్కెట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో 14.43 లక్షల మంది రైతులు, 3,469 మంది వ్యాపారులు, 2,285 మంది కమీషన్‌ ఏజెంట్లు ఈ–నామ్‌లో నమోదు చేసుకున్నారు. 194 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.29,701 కోట్ల విలువైన 51.73 లక్షల టన్నుల ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాట, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధ రకాల పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

ఎలా విక్రయిస్తారంటే.. 
ఈ–నామ్‌లో నమోదు చేసుకున్న రైతులు, వ్యాపారులు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో దేశంలో ఎక్కడి నుంచైనా క్రయవిక్రయాలు చేయవచ్చు. అమ్మిన రోజునే రైతు ఖాతాకు సొమ్ము జమ అవుతుంది. ఎల్రక్టానిక్‌ వేయింగ్‌ మిషన్ల వల్ల తూకాల్లో మోసాలకు తావుండదు. తొలుత మార్కెట్‌కు రైతు తెచి్చన సరుకు వివరాలను నమోదు చేసుకుని, ఆ రైతు ఎంచుకున్న కమీషన్‌ ఏజెంట్‌ వద్దకు పంపిస్తారు. నాణ్యత పరీక్షా యంత్రాల (ఎస్సైయింగ్‌ ల్యాబ్స్‌) ద్వారా ర్యాండమ్‌గా లాట్స్‌ నాణ్యతను పరీక్షించి ఆన్‌లైన్‌లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. రహస్య బిడ్డింగ్‌ ద్వారా వ్యాపారులు కోట్‌చేసిన ధరల్లో అత్యధిక ధర, వ్యాపారి వివరాలను రైతుకు పంపిస్తారు. రైతు ఆ ధర నచ్చితే అమ్ముకోవచ్చు. లేదంటే తిరస్కరించవచ్చు.

గుంటూరులోనే అత్యధిక వ్యాపారం 
ఈ–నామ్‌ ద్వారా ఇప్పటివరకు జరిగిన వ్యాపారంలో రూ.20,985 కోట్ల విలువైన 26.45 లక్షల టన్నుల ఉత్పత్తుల క్రయవిక్రయాలు గుంటూరు మార్కెట్‌ యార్డు పరిధిలోనే జరిగాయి. ఈ మార్కెట్‌కు వచ్చే మిర్చి కొనుగోలుకు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పోటీపడుతుంటారు. అత్యధిక మంది వ్యాపారులు పోటీపడుతున్న మార్కెట్‌గా ఆదోని మార్కెట్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున ఒక్కో లాట్‌కు 10–15 మంది పోటీ పడుతుండగా, సీజన్‌లో అత్యధికంగా 30–40 మంది కూడా పోటీపడిన సందర్భాలున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 9.36 లక్షల లాట్స్‌ కోసం 87.90 లక్షల బిడ్స్‌ దాఖలయ్యాయి. రూ.3,149 కోట్ల విలువైన 6.16 లక్షల టన్నుల క్రయవిక్రయాలతో ఆదోని వ్యాపారపరంగా ఐదోస్థానంలో నిలిచింది.

ఈ–నామ్‌కు పెరుగుతున్న ఆదరణ
రైతులతోపాటు వ్యాపారులు కూడా ఈ–నామ్‌ ద్వారా క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారపరంగా మన రాష్ట్రం నంబర్‌ 1 స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. 
– పి.ఎస్‌.ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ 

మరిన్ని వార్తలు