స్మార్ట్‌ పోలీసింగ్‌.. మనమే కింగ్‌

19 Nov, 2021 05:04 IST|Sakshi

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు మొదటి ర్యాంకు

ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడి

ఏడేళ్లలో మొదటిస్థానం ఇప్పుడే..

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయస్థాయిలో మరోసారి తన ఘనతను చాటుకుంది. స్మార్ట్‌ పోలీసింగ్‌లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రజలపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిర్ధారించేందుకు ‘స్మార్ట్‌ పోలీసింగ్‌’ అనే అంశంపై ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. స్వయం ప్రతిపత్తిగల ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సంబంధించి తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ఈ సర్వే నిర్వహించారు. వాటిలో ఆరు అంశాలు పోలీసుల సమర్థతకు సంబంధించినవి కాగా మూడు అంశాలు పోలీసు విలువలకు సంబంధించినవి.

ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత శైలి, చట్టబద్ధ–పారదర్శ పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం.. విభాగాల్లో మన రాష్ట్ర పోలీసు శాఖకు మొదటిస్థానం లభించింది. పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ వినియోగం.. విభాగాల్లో రెండోస్థానంలో నిలిచింది. మొత్తం మీద తొమ్మిది అంశాల్లో కలిపి దేశంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన డీజీపీల సదస్సులో స్మార్ట్‌ పోలీసింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన సూచనలతో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌  ఏటా ఈ సర్వే నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఏడేళ్లుగా నిర్వహిస్తున్న  సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ తొలిసారి మొదటి ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపున్న ఈ సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలవడం ద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించింది. 

సీఎం అభినందన
ప్రజలకు ఉత్తమ పోలీసు సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటిస్థానం సాధించిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖను హోం మంత్రి సుచరిత కూడా అభినందించారు. 

మరిన్ని వార్తలు