టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్‌ టాప్‌

17 Jul, 2022 04:41 IST|Sakshi

రాష్ట్ర పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో 14 అవార్డులు

సాక్షి, అమరావతి: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా గవర్నెన్స్‌ నౌ–2022 కింద ప్రకటించిన అవార్డుల్లో 14 అవార్డులను కైవసం చేసుకుంది. పోలీస్‌ ప్రధాన కార్యాలయం నాలుగు, విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా పోలీస్‌ విభాగాలు ఒక్కొక్కటి చొప్పున, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలు రెండు అవార్డుల చొప్పున దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఏపీ పోలీస్‌ శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని, స్వల్ప కాలంలోనే మొత్తంగా 189 జాతీయ అవార్డులను దక్కించుకోవడం తమ శాఖ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఏ టెక్నాలజీని వినియోగించినా వాటి ఫలాలను క్షేత్రస్థాయిలో అందించి ప్రజలకు సత్వర న్యాయం చేసినప్పుడే అది అర్థవంతమవుతుందన్నారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్‌ శాఖను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

అవార్డులు ఇలా..
శ్రీకాకుళం కమ్యూనిటీ పోలీసింగ్, విశాఖపట్నం సిటీ మహిళా భద్రత, కాకినాడ స్ట్రాటజిక్‌ రెస్పాన్స్‌ సెంటర్, ఎన్టీఆర్‌ ఈ–పోలీసింగ్‌ ఇనిషియేటివ్, రోడ్డు సేఫ్టీ అండ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, ప్రకాశం సర్వేలెన్స్‌ అండ్‌ మానిటరింగ్, చిత్తూరు నేరాల గుర్తింపులో టెక్నాలజీ వినియోగం, తిరుపతి మహిళల భద్రత, పోలీసింగ్‌ ఇనిషియేటివ్‌ టెక్నాలజీ, కడప కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ విభాగంలోను అవార్డులను దక్కించుకోగా, పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ప్రాసిక్యూషన్‌లో రెండు, పోలీస్‌ ఆధునికీకరణలో రెండు మొత్తం నాలుగు అవార్డులు దక్కాయి. 

మరిన్ని వార్తలు