కొక్కొరొకో.. ఎంత సొగసో.. అందాల పోటీలకు సై అంటున్న కోడిపుంజులు

12 Feb, 2023 20:57 IST|Sakshi

పోటీల కోసం రెండేళ్లపాటు ప్రత్యేకంగా పెంపకం  

బలమైన ఆహారంతో బాడీబిల్డర్‌లాంటి దేహ దారుఢ్యం   

తమిళనాడు, కేరళకే పరిమితమైన పోటీలు మన రాష్ట్రంలోనూ.. 

‘‘నడత హుందాగా ఉండాలి..నడకలో హొయలొలకాలి..రంగు మెరిపించాలి.. పొంగు భళా అనిపించాలి..’’ ఇవి గ్లామర్‌ కాంటెస్ట్‌లో పోటీపడే బ్యూటీలకు కావాల్సిన అర్హతలని చదువుతుంటేనే అర్థమైపోతుంది. అయితే ఆ అందం గంప కింద నుంచి రావాలి అనే కొత్త రూల్‌ చదివితే మాత్రం మైండ్‌ బ్లాంకైపోతుంది. అవును.. ఆ గంప కింద ఉన్న కోడి ఇప్పుడు అందాల ర్యాంప్‌పైన కూస్తోంది. తోటి కోళ్లతో పోటీపడి మరీ వయ్యారాలొలకబోస్తోంది. అందాల కోడి కిరీటం కోసం ‘సై’ అంటోంది. కోడేమిటి? అందాల పోటీలేమిటి? సమాధానమే ఈ కథనం..ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి.. 

కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్‌ బాష ..పక్షి ప్రేమికుడు. ఇతని వద్ద రకరకాల పక్షులతోపాటు వివిధ రకాల కోడి పుంజులు, పెట్టలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తున్న పుంజుల గురించి అడగగా..ఇవి అందాల పోటీల కోళ్లని చెప్పడంతో ఆశ్చర్యపోయాం.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందాల పోటీలా? ఎక్కడ జరుగుతున్నాయి..? ఏంటి ప్రత్యేకతలు అని ప్రశ్నించాం.. మనకు సంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి గోదారోళ్లు నిర్వహించే కోడి పందేల్లా..తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పాడు.

జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరవుతున్నాం. ఈ సారి రాష్ట్రంలోని పెంపకందారులం అందరం కలసి అసోసియేషన్‌గా ఏర్పడ్డాం. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సంక్రాంతికి కోడి అందాల పోటీలు నిర్వహించారని చెప్పాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్‌ఘడ్, ఒడిసా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల వారు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వయ్యారాలొలకబోసే కోడి పుంజుల ప్రత్యేకతలు తెలుసుకుందాం.. 

ఆహార్యం..అద్భుతం 
ఈ పోటీల్లో పాల్గొనే పుంజులు ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండాలి. తల నుంచి బాడీ, తోక, కాళ్ల వరకూ అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే. మెడ నిటారుగా 90 డిగ్రీలో బాడీ ఉండాలి. తెల్ల కళ్లు బెస్ట్‌ క్వాలిటీ..తలపై భాగం జుట్టు ఎర్రగా ఉండి గుండ్రంగా గులాబి రేకుల్లా ముద్దగా పువ్వు అతికించినట్టుగా ఉండాలి. బాడీ దృఢంగా ఉండి కాళ్లు..కాళ్లు మధ్య ఎడం ఉండాలి. బాడీ బిల్డర్‌ ఎలా నడుస్తాడో అలా నడకలో స్టైల్‌ ఉండాలి. కాళ్ల వేళ్లు పొడవుగా చక్కగా ఉండాలి. తోక అందంగా ఉండి ఈకలు దుబ్బగా ఉండాలి. తెలుపు, రెడ్, బ్లాక్‌ కిరీ ఇలా కోడి మొత్తం ఫ్యాన్సీ కలర్‌లో ఉంటే అందరూ ఇష్టపడతారు.

ఎంపిక ఇలా.. 
అందాల పోటీల ఎంపిక ఇలా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కోళ్లను ముందుగా నిర్వాహకులు పరిశీలిస్తారు. అర్హమైన వాటిని గుర్తిస్తారు. వాటికి నంబర్‌తో కూడిన ట్యాగ్‌లు ఇస్తారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉంటారు. అందులో ప్రభుత్వాధికారులు (పశుసంవర్ధకశాఖకు చెందిన) కూడా ఉంటారు. మధ్యలో ఒక టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. నంబర్‌ ప్రకారం పిలుస్తారు. టేబుల్‌పై ఉంచిన పుంజును జడ్జిలు పరిశీలించి మార్కులు ఇస్తారు. ఒకరు ముక్కు నుంచి మెడ వరకూ ఎంత దూరం ఉంది అని పరిశీలిస్తారు. మరొకరు బాడీ స్టైల్, రంగు, కాళ్లు, కళ్లు ఇలా అన్నీ పరిశీలిస్తారు. ఈ ఐదుగురు ఇచ్చిన మార్కులను కలుపుతారు. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు.   

ప్రత్యేక శిక్షణ: 
పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోటీలకు మూడు నెలల నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ ఇస్తారు. బెదురు పోయేందుకు బాడీని నిమురుతారు. అలాగే నీళ్లతో తడుపుతారు. ఇసుకలో పొర్లిస్తారు. ఇలా చేయడం ద్వారా ఈక ఒత్తుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండేళ్లు పెంచుతారు. పోటీలకు సిద్ధమయ్యే పుంజులు ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు ఉండేలా చూసుకుంటారు. డబుల్‌ బాడీ వచ్చేలా ఫీడింగ్‌ ఇస్తారు. గంభీరంగా బాడీబిల్డర్‌లా ఉంటుంది. కాళ్లు దృఢంగా, పాదాలు పెద్ద పెద్దగా ఉండేలా చూసుకుంటారు. వీటిని ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంచుతారు.  

పౌష్టికాహారం... 
ఈ పోటీలకు సిద్ధం చేసే పుంజులకు ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, పెసలు, గుడ్డు, ఖర్జూరం, పిస్తా, బాదం, జీడిపప్పు, పండ్లు తినిపిస్తారు. రోజూ మూడు విడతలుగా ఆహారం ఇస్తారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సమ్మర్‌లో వేడి తగ్గించేందుకు పుచ్చకాయ పెడతారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ కొలత ప్రకారం జొన్నలు, రాగులు, సజ్జ, మొక్కజొన్న, పెసలు, గోధుమలు ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోడి గుడ్డు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ తినిపిస్తారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు అరటి, దానిమ్మ, ద్రాక్ష పండ్లు ఇస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడంతో శరీరం బలిష్టంగా ఉంటుంది. అందాల పోటీలకు ఒక కోడిని తయారు చేసేందుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది.   

క్రాస్‌ బ్రీడింగ్‌.. 
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉండే బ్రీడర్‌ దగ్గర నుంచి బ్రీడ్‌ తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టలతో క్రాస్‌ బ్రీడ్‌ చేస్తారు. అలా వచ్చిన పుంజులను రెండేళ్లపాటు పెంచుతారు. వీటి గుడ్డు కూడా చాలా విలువైంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మన జిల్లాలో రూ.1000 ఉంటుంది. తమిళనాడులో అయితే రూ.5 వేల వరకూ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలను ఆసక్తి ఉన్నవారికి విక్రయిస్తుంటారు.


ఆసక్తితోపాటు ఆదాయం.. 

చిన్నప్పటి నుంచి పక్షులను పెంచడం హాబీగా ఉండేది. తమిళనాడులో అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మిత్రుడు చెప్పాడు. ఒకసారి వెళ్లి చూసి వచ్చిన తర్వాత కోడి పుంజులను పెంచాలన్న ఆసక్తి నెలకొంది. మంచి బ్రీడ్‌లను తీసుకొచ్చాను. అలా పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నా. అనంతపురంలో తొలిసారిగా నిర్వహించిన పోటీలకు పుంజును తీసుకువెళ్లా. ఈ పోటీల్లో నాలుగో స్థానం వచ్చింది. వీటిని పెంచి ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ద్వారా ఉపాధి కూడా ఉంటోంది.  
– సయ్యద్‌ బాష, రాజుపాలెం, కొమరోలు మండలం
చదవండి: బ్రాండెడ్‌ గుడ్డు గురూ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌!

మరిన్ని వార్తలు