మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్‌

19 Oct, 2022 06:00 IST|Sakshi

స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు సాధించాలి

నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి సారించాలి

తద్వారా ఎగుమతులు రెట్టింపు అవుతాయి

జర్మనీలో భారత రాయబారి హరీష్‌

అన్ని రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనుకూలం: పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన

సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్‌ అని జర్మనీలో భారత్‌ రాయబారి పర్వతనేని హరీష్‌ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్‌ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌) సర్టిఫికేషన్‌పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు.

ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్‌.. తద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు.

అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్‌ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు.

అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు.

ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్‌–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో 90 రకాల ఆన్‌లైన్‌ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు.

అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు 
ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, బొమ్మలు, ఫర్నీచర్‌ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్‌ హబ్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ తదితరులు మాట్లాడారు.  

అమృత్‌ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం
వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్‌ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. ‘మిషన్‌ అమృత్‌ సరోవర్‌’పై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్‌ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు