ప్రజారోగ్య సంరక్షణలో ఏపీ ది బెస్ట్‌.. ర్యాంకులు ప్రకటించిన కేంద్రం 

15 Oct, 2022 08:08 IST|Sakshi

ప్రజారోగ్య సంరక్షణలో ఉత్తమ పనితీరు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. గర్భిణులకు చెకప్‌లు, 9–11 నెలల పిల్లలకు టీకాలు వేయడం వంటి అంశాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెచ్‌ఎంఐఎస్‌ 2021–22 అనాలసిస్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది. 

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, ఇమ్యునైజేషన్‌ సహా 13 అంశాలపై పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా (మూడు విభాగాలుగా) పనితీరు ఆధారంగా ర్యాంక్‌లు కేటాయించింది. ఈ ర్యాంకులు ఇవ్వడానికి హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పోర్టల్‌ ద్వారా తొలిసారిగా దేశంలోని 735 జిల్లాల్లోని 1,64,440 సబ్‌ సెంటర్లు, 32,912 పీహెచ్‌సీలు, 15,919 కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లు, 2,970 సబ్‌ జిల్లా ఆస్పత్రులు, 1,264 జిల్లా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లోని 2.17 లక్షల ఆరోగ్య సేవలను మ్యాపింగ్‌ చేసినట్లు హెచ్‌ఎంఐఎస్‌ ఈ–బుక్‌ బులెటిన్‌లో పేర్కొంది. 

కొత్త పోర్టల్‌లో వ్యక్తి నిర్ధిష్ట వినియోగదారు ఆధారాలు, రియల్‌ టైమ్‌ డేటా ఎంట్రీ, రియల్‌ టైమ్‌ మానిటరింగ్, నేషనల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ (అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌) ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 9 నుంచి 11 నెలల పిల్లలకు టీకాలు ఇవ్వడం (ఇమ్యునైజేషన్‌)లో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి నంబర్‌–1 ర్యాంక్‌ రాగా.. తెలంగాణకు 5, తమిళనాడుకు 11 ర్యాంక్‌లు లభించాయి. 

ఇదే సందర్భంలో గర్భిణులకు ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్‌సీ చెకప్‌లు నిర్వహించడంలోనూ దేశంలోనే నంబర్‌–1 ర్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్‌ దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉండగా.. పొరుగున ఉన్న తెలంగాణ 13వ ర్యాంక్‌కు పరిమితమైంది.  ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని అంశాల పనితీరులోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి రెండో ర్యాంక్‌ దక్కింది.  

బెడ్‌ ఆక్యుపెన్సీలోనూ.. 
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంతకన్నా పెద్ద ఆస్పత్రుల్లో బెడ్‌ ఆక్యుపెన్సీ విషయంలో ఏపీ  57.8 శాతంతో దేశంలోనే రెండోర్యాంకులో నిలిచింది. జాతీయస్థాయిలో బెడ్స్‌ ఆక్యుపె న్సీ 27.9 శాతమే ఉంది. ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండేందుకు గర్భిణులకు టెటానస్‌ టాక్సాయిడ్‌ ఇంజెక్షన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్‌ 103.9 శాతంతో రెండవ ర్యాంకులో ఉంది. జాతీయ స్థాయిలో ఈ ఇంజెక్షన్లను 73.9 శాతమే వేశారు. ఇంటి దగ్గర డెలివరీల్లో 69.0 శాతం మేర  స్కిల్‌ బర్త్‌ అటెండెంట్స్‌ హాజరవుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ మూడో ర్యాంకులో నిలిచింది. జాతీయ స్థాయిలో 17.5 శాతం మాత్రమే హాజరు ఉంది. ఇనిస్టిట్యూషన్‌ డెలివరీల్లో ఆంధ్రప్రదేశ్‌ 70.7 శాతంతో 6వ ర్యాంకు పొందింది. జాతీయ స్థాయిలో 53.4 శాతమే ఇనిస్టిట్యూషన్‌ డెలివరీలున్నాయి. 

మరిన్ని వార్తలు