చిరపుంజిలా మారిన సీమ

8 Dec, 2021 04:49 IST|Sakshi
నీటితో నిండిన తిరుపతి రాయల్‌ చెరువు

రాయలసీమలోని 3 జిల్లాల్లో జోరువానలు 

‘అనంతలో’ అత్యధికం..కడపలో కుమ్మేసింది 

ఈ ఏడాది రాష్ట్రంలో 2.66 శాతం అధిక వర్షపాతం

సాక్షి, విశాఖపట్నం: కరువు సీమలో ఈ ఏడాది కుంభవృష్టి కురిసింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడగా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో 2.66 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సకాలంలో నైరుతి రుతుపవనాల రాక, ఈశాన్య రుతుపవనాలు కూడా అదే రీతిలో జోరందుకోవడంతో వరుసగా మూడో ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురిశాయి.

వీటికి తోడు అల్పపీడనాలు, వాయుగుండం, తుపాన్లతో కుండపోత వానలు పడ్డాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 950 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 2.66 శాతం అధికంగా 975.29 మి.మీ. వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతంతో పోలిస్తే రాయలసీమలోని మూడు జిల్లాలు అత్యధిక వర్షపాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అనంతపురం జిల్లాలో సగటు వర్షపాతం కంటే 36.36 శాతం అత్యధికంగా వర్షాలు కురవగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 33.81 శాతం, చిత్తూరులో 27.17 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి.   

కడపలో 150 ఏళ్లలో తొలిసారి.. 
ప్రధాన నగరాల వారీగా చూస్తే కడపలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కడపలో 150 ఏళ్లలో తొలిసారిగా ఏకంగా 1,764 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1,663 మి.మీ.తో విజయవాడ రెండోస్థానంలో ఉంది. విజయనగరంలో 1,476, కాకినాడలో 1,433, విశాఖపట్నంలో 1,421, రాజమండ్రిలో 1,412, తిరుపతిలో 1,395, గుంటూరులో 1,121, నెల్లూరులో 1,061, అమరావతిలో 951 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో అత్యల్పంగా 538 మి.మీ. వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడించాయి. రాష్ట్రమంతటా పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. ప్రతి ప్రాంతంలో నీటివనరులు నిండుకుండల్లా తొణికిసలాడుతుండటం శుభపరిణామమని పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు