‘సీమ’లో ప్లాంట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు

17 Nov, 2020 20:07 IST|Sakshi

దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుల వైపు నెడ్‌క్యాప్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానం (ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) కోసం లక్ష ఎకరాలను గుర్తించగా పవన, సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు వీటిని ఇవ్వనున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇందుకు అపార అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పి విద్యుత్‌ను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేందుకు ఎక్స్‌పోర్ట్‌ పాలసీ వీలు కల్పిస్తుంది. ఈ విధానం కింద ముందుకొచ్చే సంస్థలకు సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌కాప్‌) మౌలిక వసతులు కల్పిస్తోంది.

లీజుకు భూమి
సోలార్, విండ్‌ ప్లాంట్లు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వమే భూమి సమకూరుస్తుంది. 25 ఏళ్ల పాటు లీజుపై ఇస్తారు. ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్‌కు రూ. లక్ష చొప్పున ప్రభుత్వానికి రాయితీ చెల్లించాలి.

ఏపీలో ప్లాంట్లు స్థాపించినా విద్యుత్‌ను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. పవర్‌ గ్రిడ్‌ లైన్‌తో పాటు ఏపీ ట్రాన్స్‌కో లైన్‌ను వినియోగించుకుంటే ఆయా సంస్థలకు నిర్ణీత ధర చెల్లించాలి. ఎక్స్‌పోర్ట్‌ పాలసీని దృష్టిలో ఉంచుకుని నెడ్‌క్యాప్‌ ఇప్పటికే 1,00,611.85 ఎకరాలను గుర్తించగా ఇందులో చాలావరకూ ప్రభుత్వ భూమే ఉంది.

పెద్ద సంస్థలు రెడీ
ఏపీలో సోలార్, పవన విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పేందుకు పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయి. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెకీ) 4 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) 5 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలతో కలసి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఆసక్తి చూపుతున్నాయని నెడ్‌క్యాప్‌ తెలిపింది. (చదవండి: రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ)

సోలార్‌ ప్లాంట్ల కోసం గుర్తించిన భూమి

జిల్లా ఎన్ని ఎకరాలు?
అనంతపురం 29,982.92
కడప 29,548.79
ప్రకాశం     9,630
కర్నూలు 31,450.14
మొత్తం 1,00,611.85

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా