ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు

4 Mar, 2023 04:49 IST|Sakshi
భావనపాడు పోర్టు నమూనా

రాష్ట్రంలో వ్యాపారావకాశాలు, పెట్టుబడులపై విదేశీ ప్రతినిధులతో ఏపీ అధికారులు  

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, నెదర్లాండ్స్‌ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్‌ నిర్వహించారు.

ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు.

అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు