Food Safety License: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకులకు షాక్‌.. లైసెన్స్‌ లేకపోతే జైలుకే!

24 Jul, 2022 15:00 IST|Sakshi
రోడ్డు పక్కనే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న టిఫిన్‌ సెంటర్‌

సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్‌ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. 

పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. 
జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్‌లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్‌ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్‌ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్‌లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.  
ఏటా లైసెన్స్‌ రెన్యువల్‌.. 
ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్‌లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్‌లను ఏటా రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకున్నారు.  ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్‌లు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

100 కేసుల నమోదు.. 
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. 
ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్‌ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం.  
– ఈశ్వరి, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్, విజయనగరం జిల్లా

చదవండి: డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

మరిన్ని వార్తలు