APSRTC: సంక్రాంతికి ఊరెళుతున్నారా..? ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

30 Nov, 2022 11:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ శుభవార్తలు చెప్పింది. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్‌ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అంతేకాదు.. సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ మరో వెసులుబాటును కల్పించింది. ఏటా దసరా, సంక్రాంతి పండగల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్స్‌ పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదనపు బాదుడు లేకుండా సాధారణ చార్జీలతోనే స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది.  

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభం 
ఈ సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ఇటీవలే ప్రారంభించింది. దూరప్రాంతాలకు వెళ్లే వారు కొంతమంది ఇప్పట్నుంచే తమ టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిన వారు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో ఏ బస్సులో ప్రయాణించినా టిక్కెట్టుపై 10 శాతం రాయితీ వర్తిస్తుందని విశాఖ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టును apsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా ముందుగా బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతి పండగ రద్దీకనుగుణంగా అవసరమైన బస్సులను నడుపుతామని ఆయన తెలిపారు.  

వారం రోజుల ముందు నుంచి.. 
సంక్రాంతి పండగకు ఏటా ఆర్టీసీ అధికారులు విశాఖ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతారు. ఇలా విశాఖ రీజియన్‌ నుంచి గత సంక్రాంతికి 641 బస్సులను నడిపారు. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచి ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఈ లెక్కన జనవరి ఏడెనిమిది తేదీల నుంచి ఈ స్పెషల్స్‌ను అందుబాటులోకి తెస్తారు. అలాగే తిరుగు ప్రయాణం చేసే వారి కోసం 20వ తేదీ వరకు నడుపుతారు.   

చదవండి: ఇప్పటం లోగుట్టు లోకేష్‌కు ఎరుక.. ఆర్కే తనదైన శైలిలో..

మరిన్ని వార్తలు