కృష్ణానదికి కొనసాగుతున్న వరద

18 Sep, 2021 04:20 IST|Sakshi
నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి 12 క్రస్ట్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు 

శ్రీశైలం జలాశయం 4 గేట్లు తెరిచి నీటివిడుదల

నాగార్జునసాగర్‌ నుంచి 2,27,795 క్యూసెక్కులు దిగువకు

పులిచింతల నుంచి 1,74,477 క్యూసెక్కులు విడుదల

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌/సత్రశాల/అచ్చంపేట: కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శుక్రవారం ఉదయం 7 గేట్లను 10 అడుగుల మేర తెరిచి నీటిని విడుదల చేశారు. క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం 3 గేట్లను మూసేసి, 4 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 1,11,932 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 50,884 క్యూసెక్కులు వదులుతున్నారు.

జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి శుక్రవారం సాయంత్రానికి 1,05,983 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టంలో 214.8450 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్‌కు భారీగా నీరు వస్తుండటంతో శుక్రవారం 12 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,27,795 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మొదటిసారి ఆగస్టు 1న సాగర్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు.

ఈ ఏడాదిలో సాగర్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తటం ఇది రెండోసారి. జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. జలాశయంలో 311.4474 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌ కుడికాలువకు 8,680 క్యూసెక్కులు, ఎడమకాలువకు 8,454, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 28,785 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ నుంచి టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టుకు 2,12,337 క్యూసెక్కులు వస్తుండగా 2,30,939 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో 6.396 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టుకు శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి  2,09,154 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,74,477 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం పులిచింతలలో 32.7952 టీఎంసీల నీరు ఉన్నట్లు చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు