దేశానికి ఆంధ్రప్రదేశ్‌ రోల్‌మోడల్‌గా ఉండాలి

17 Oct, 2020 04:23 IST|Sakshi

జాతీయ విద్యా విధానం అమలుపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ) అమలులో దేశానికి ఆంధ్రప్రదేశ్‌ రోల్‌ మోడల్‌గా ఉండాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. ఎన్‌ఈపీ అమలుపై శుక్రవారం రాజ్‌భవన్‌ నుంచి విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. నిజమైన స్ఫూర్తితో ఎన్‌ఈపీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్‌ సవాళ్లను అధిగమించడంలో వీసీలు కీలక భూమికను పోషించాలని కోరారు. ఉన్నత విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, ఆ విద్యాసంస్థలను అన్ని రంగాల్లో క్రమశిక్షణ కలిగిన సంస్థలుగా మార్చడం ద్వారా దేశంలో బలమైన, శక్తివంతమైన విద్యా వ్యవస్థకు ప్రభుత్వం మార్గం చూపిందన్నారు.

వర్సిటీలు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక, మౌలిక, మానవ వనరుల కొరత సమస్యలను అధిగమించాలని చెప్పారు. ఈ సందర్భంగా వీసీలు ఎన్‌ఈపీ–2020పై భవిష్యత్‌ కార్యాచరణను గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం అమలుతో ఉన్నత విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక, సంస్థాగత, పాఠ్య సంస్కరణలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాల ద్వారా విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యా శాఖ ఉన్నతాధికారులు సతీష్‌ చంద్ర, ఎంఎం.నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు