నోటరీ విధానం ఇక పక్కా: తప్పుడు స్టేట్‌మెంట్లకు చెక్‌!

9 Jul, 2021 07:45 IST|Sakshi

నోటరీలకు త్వరలో యూనిక్‌ ఐడీలు

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ

అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు

సాక్షి, అమరావతి: నోటరీలు పారదర్శకంగా పనిచేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొందరు నోటరీలు తప్పుడు స్టేట్‌మెంట్లను నోటిఫై చేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరికొందరు లైసెన్సు లేకపోయినా నోటరీ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటివల్ల నోటరీలు చేయించుకున్న వ్యక్తులు ఇబ్బందులు పడటంతోపాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటరీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నడుం బిగించింది. నోటరీలు ఇచ్చే అఫిడవిట్లు, ఇతర సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది.

ఇకపై ప్రతి నోటరీకి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి వారు జారీ చేసే సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైసెన్సు ఉన్న ప్రతి నోటరీకి ఒక యూనిక్‌ ఐడీ ఇవ్వనున్నారు. నోటరీలు జారీచేసే అఫిడవిట్లపై ఈ యూనిక్‌ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు, విచారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు అవకాశం ఉంటుంది. నోటరీలను పర్యవేక్షించేందుకు ఈ రెండు చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అవతవకలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రెండు నెలల్లో వీటిని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

నోటరీ లైసెన్సులు పెంచేందుకు చర్యలు 
మరోవైపు నోటరీ లైసెన్సుల్ని పెంచేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 1,906 మంది నోటరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు 13 జిల్లాల్లో సుమారు 2,400 మంది నోటరీలు ఉండేవారు. తక్కువ మంది నోటరీలకే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా లైసెన్స్‌ పీరియడ్‌ ముగిసిన వారికి రెన్యువల్‌ చేయడం నిలిపివేశారు.

కొత్తగా నోటరీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. దీంతో నోటరీల అవసరం, న్యాయవాదుల ఉపాధి వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మరో 500 మందికి నోటరీ లైసెన్సులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి వస్తే కొత్తగా మరికొందరు న్యాయవాదులకు నోటరీ లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది. 

లోపాలను సరిదిద్దేందుకు చర్యలు
నోటరీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడా కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు యూనిక్‌ ఐడీ విధానం, వారు జారీ చేసిన అఫిడవిట్లను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయించేలా కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నాం.
– ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్‌ అండ్‌ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు