అందమైన రాతలో ఆంధ్రాదే పైచేయి

8 Feb, 2023 04:40 IST|Sakshi
ప్రహర్షిక, అవ్యక్త, జివితేష్‌

జాతీయ స్థాయి చేతి రాత పోటీల్లో ఏపీకి మొదటి స్థానం

సాక్షి, అమరావతి: జాతీయ స్థాయి చేతిరాత దినోత్సవం సందర్భంగా జనవరి 29న నిర్వహించిన దేశవ్యాప్త చేతిరాత పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందని ఆలిండియా గ్రాఫాలజీ, హ్యాండ్‌ రైటింగ్‌ అసోసియేషన్, ఇండియన్‌ హ్యాండ్‌ రైటింగ్‌ ట్రయినర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్కే ఎం.హుస్సేన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల విడుదలైన జాతీయ చేతిరాత పోటీల ఫలితాల్లో విజయవాడకు చెందిన 9వ తరగతి విద్యార్థి సేనాపతి జివితేష్‌ ‘నేషనల్‌ ఓవరాల్‌ చాంపియన్‌’గా నిలిచాడని పేర్కొన్నారు.

ఏలూరుకు చెందిన ఆలపాటి ప్రహర్షిక ‘నేషనల్‌ ఎక్సలెన్సీ బెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌’ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపారు. విజయవాడకే చెందిన అవ్యక్తా ప్రద్యుమ్న పూజారికి ‘మిస్‌ ఇండియా బెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌’ అవార్డు లభించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొత్తం ఎనిమిది రకాల ఉత్తమ అవార్డులందిస్తుంటారని, అందులో నేషనల్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌తో పాటు మరో రెండు అవార్డులు ఏపీకి రావడం విశేషమని పేర్కొన్నారు. ఇంతకు ముందు 2019లో నిర్వహించిన జాతీయస్థాయి చేతిరాత పోటీల్లో ఏపీ 18వ స్థానంలో ఉండగా, ఈ సారి మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు.  

మరిన్ని వార్తలు