ఆ 3 ముఖ్యం.. 27 రోజులు ప్రచారం 

7 Aug, 2021 04:36 IST|Sakshi

కోవిడ్‌ నియంత్రణకు పక్కా ప్రణాళిక 

మాస్క్, భౌతికదూరం, తరచూ చేతులు కడుక్కోవడం తప్పనిసరి 

కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్‌ ఫిల్మ్‌లతో భారీ ప్రచారం 

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదలతో అప్రమత్తం 

కోవిడ్‌ను అరికట్టేందుకు జాగ్రత్తలపై రోజుకో కార్యక్రమం 

రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం (నో మాస్క్‌.. నో ఎంట్రీ), భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం.. ఈ మూడు కరోనా వైరస్‌ నియంత్రణకు కీలకమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 27 రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాలు గురువారం (ఈనెల 5న) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్‌ ఫిల్మ్‌లతో చేపట్టిన ఈ ప్రచారంలో ఏరోజు ఎక్కడ ఏకార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు.

కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణ
కోవిడ్‌ను నియంత్రించేందుకు నిఘా, పరీక్షలను బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్‌ ట్రేసింగ్, చికిత్స, కోవిడ్‌ టీకా కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్‌–19 నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ ప్రచారం చేపట్టింది. ఈనెల 31న ముగిసే ఈ ప్రచార కార్యక్రమాలను కలెక్టర్లు, ఎస్‌పీలు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కేంద్రస్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల వారు, జిల్లా ఆస్పత్రుల స్థాయిలో జిల్లా వైద్యాధికారులు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిలో మునిసిపల్‌ కమిషనర్లు, సంబంధిత పోలీసు, వైద్య అధికారులు, డివిజన్‌ స్థాయిలో సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్‌పీలు, మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, పీహెచ్‌సీ వైద్యులు ఈ అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై కలెక్టర్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించేలాగ అన్ని శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారంటే.. 
గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, సినిమాహాళ్లు, క్రీడాసముదాయాలు, విహారస్థలాలు, వివాహాలు వంటి కార్యక్రమాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తారు. అందరూ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా, తరచూ చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు.   

21 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలలో తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అనంతరం నిత్య అలంకరణ, పవిత్రమాలధారణ జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేద పారాయణ, హారతి, మంత్ర పుష్పం జరుగుతాయి. 23న ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండబలి అనంతరం మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.  

అన్ని ఆర్జిత సేవలు రద్దు: మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల నేపథ్యంలో అలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను దేవస్థాన అధికారులు రద్దు చేశారు. ప్రత్యక్ష పూజలతో పాటు పరోక్ష పూజలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం 20న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు