మూలధన వ్యయంలో.. ఏపీ అత్యుత్తమ ప్రగతి

15 Sep, 2021 02:35 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ నిర్ధారించిన లక్ష్య సాధనలో రాష్ట్రం టాప్‌

దీంతో మరింత వృద్ధి కోసం రాష్ట్రానికి ప్రోత్సాహకం

అదనంగా రూ.2,655 కోట్ల మేర రుణానికి వెసులుబాటు

ఏపీ సహా మొత్తం 11 రాష్ట్రాలకు అదనంగా రూ.15,721 కోట్ల రుణానికి అనుమతి

కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన        

అప్పులపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రచారం బూటకమని తేల్చిన ప్రకటన  

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూల ధన వ్యయంలో అత్యుత్తమ ప్రగతి సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. నిర్ధారించిన లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని తెలిపింది. ఏపీ సహా 11 రాష్ట్రాలు.. ఈ ఘనత సాధించినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రూ.15,721 కోట్ల మేర అదనపు రుణం సమకూర్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అనుమతి మంజూరు చేసింది. ఇందులో ఏపీకి రూ.2,655 కోట్ల రుణానికి అనుమతి లభించింది. ఈ అదనపు రుణం ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 0.25 శాతానికి సమానంగా చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సహాయపడతాయని తెలిపింది. ఈ మూల ధన వ్యయం భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు మరింత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. 

రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాలు
అలాగే, రాష్ట్రాలు అదనంగా 0.50 శాతం మేర రుణ సేకరణకు అనుమతి పొందాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రతి రాష్ట్రానికి మూల ధన వ్యయం లక్ష్యాలను నిర్ధారించింది. ఇందులో భాగంగా.. మొదటి త్రైమాసికంలో 15 శాతం, రెండో త్రైమాసికంలో 45 శాతం, మూడో త్రైమాసికంలో 70 శాతం, నాలుగో త్రైమాసికం చివరి నాటికి నూరు శాతం సాధించాల్సి ఉంటుంది. మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని సాధించినందున ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,655 కోట్ల మేర అదనపు రుణ పరిమితిని మంజూరు చేసింది. ఇక రాష్ట్రాల మూలధన వ్యయ లక్ష్యాలపై తదుపరి సమీక్ష ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహిస్తామని.. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు రాష్ట్రాలు సాధించిన మూలధన వ్యయాలను అంచనా వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మూల ధన వ్యయంతో ముడిపడిన ప్రోత్సాహక అదనపు రుణాన్ని లక్ష్లా్యలను సాధించిన రాష్ట్రాలకు తదుపరి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించింది.  

అప్పులపై విపక్షాలు, ఎల్లో మీడియాది దుష్ప్రచారమే
అప్పులపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒట్టి బూటకమని కేంద్రం చేసిన ఈ ప్రకటన రుజువు చేసింది. మరింత ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతివ్వడంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవంలేదని స్పష్టమవుతోంది. కేంద్ర నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు రూఢీ అయినట్లయింది. 

మరిన్ని వార్తలు