తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా

26 Aug, 2021 05:19 IST|Sakshi
సత్తి కార్తికేయ ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ర్యాంకు, శ్రీనివాస కార్తికేయ అగ్రి, మెడికల్‌ 4వర్యాంకు

టాప్‌ టెన్‌లో ఏపీ విద్యార్థులు 

ఇంజనీరింగ్‌లో ఆరుగురు, అగ్రికల్చర్‌లో నలుగురు మనోళ్లే

కటాఫ్‌ మార్క్‌ 40గా నిర్ణయం

సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్‌వర్క్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలోనూ ఏపీకి టాప్‌ టెన్‌లో నాలుగు దక్కాయి. ఫలితాలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజనీరింగ్‌ విభాగంలో 82.08 శాతం, అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలో 92.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఇంటర్మీడియట్‌ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్‌ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్‌ మార్క్‌ 40గా నిర్ణయించారు. తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 1,64,963 మంది దరఖాస్తు చేయగా.. 1,47,991 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,21,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలో 86,641 మంది దరఖాస్తు చేయగా.. 79,009 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 73,070 మంది అర్హత సాధించారు.    

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తనవుతా
ఐఐటీ, ముంబైలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తగా రాణించాలని ఉంది. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో చదివేందుకు క్యాట్‌ పరీక్ష రాస్తా. 
– సత్తి కార్తికేయ, ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ర్యాంకర్, పాలకొల్లు

158.49 పర్సంటైల్‌తో ప్రథమ ర్యాంక్‌
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ తెలంగాణ ఎంసెట్‌లో 158.497905 పర్సంటైల్‌ సాధించి ప్రథమ ర్యాంకర్‌గా నిలిచాడు. వ్యాపారి సత్తి త్రినాథరావు, కృష్ణకుమారి దంపతుల రెండో కుమారుడైన కార్తికేయ ఇప్పటికే 99.99 పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా ర్యాంక్‌లో ఉన్నాడు. ఆలిండియా ఒలింపియాడ్‌లో 5వ ర్యాంకు సాధించాడు. ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌లోనూ సత్తా చాటాడు. 

ఐఐటీ చేయాలని..
తెలంగాణ ఎంసెట్‌లో వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం శెవనవారిపల్లికి చెందిన దుగ్గినేని వెంకట ప్రణీత్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రెండో ర్యాంక్‌ సాధించాడు. ప్రణీత్‌ తండ్రి దుగ్గినేని యుగంధర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌లో డీఈఈగా గుంతకల్లులో పని చేస్తున్నారు. ఇటీవల రాసిన జేఈఈ మెయిన్స్‌లో నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ముంబైలో ఐఐటీ చేయాలన్నది తన లక్ష్యమని ప్రణీత్‌ చెప్పాడు.
అమ్మా, నాన్నల బాటలోనే..
అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో అనంతపురం రామచంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస కార్తికేయ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకుతో సత్తా చాటాడు. మొత్తం 160 మార్కులకు గాను 150.04 మార్కులు సాధించాడు. ఇతని తల్లి పద్మజ, తండ్రి సుధీంద్ర ఇద్దరూ వైద్యులే. ప్రస్తుతం నీట్‌కు సిద్ధమవుతున్నానని, మెడిసిన్‌ చదవాలనేది తన లక్ష్యమని  శ్రీనివాస కార్తికేయ తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు.

డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో..
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ చెందిన చందం విష్ణువివేక్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో ఐదో ర్యాంకు సాధించాడు. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విష్ణు వివేక్‌ చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు అతడి తల్లి లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం విష్ణు నీట్‌కు సిద్ధమవుతున్నాడు. డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని తెలిపాడు.

వైద్యుడిగా రాణించాలని..
కాకినాడకు చెందిన కోలా పవన్‌రాజు అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో 149.63 మార్కులతో 6వ ర్యాంక్‌ సాధించాడు. ఇతని తండ్రి కేఎస్‌వీవీఎస్‌ రాజు రైల్వేలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఇంజినీర్‌. తల్లి గంగాభవాని గృహిణి. నీట్‌ పరీక్ష రాసి వైద్య కోర్సు అభ్యసించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది తన జీవిత లక్ష్యమని పవన్‌ తెలిపాడు. 

సత్తా చాటిన క్లాస్‌మేట్స్‌
ఇంజనీరింగ్‌ విభాగంలో విజయనగరం పట్టణానికి చెందిన మిడతాన ప్రణయ్‌ 7వ ర్యాంకు, ఎస్‌.దివాకర్‌ సాయి 9వ ర్యాంకు సాధించారు. ఇద్దరూ ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు విజయనగరంలో చదివారు. టెన్త్, ఇంటర్‌ విజయవాడలో చదువుకున్నారు. అక్కడ ఇద్దరూ రూమ్‌ మేట్స్‌ కూడా. మిడతాన ప్రణయ్‌ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి వి.జ్యోతి గంట్యాడ మండలం రామవరం జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు టీచర్‌ కాగా.. తండ్రి ఎంవై రామారావు లక్కిడాం జెడ్పీ హైస్కూల్‌లో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు. ఐఐటీ ముండైలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలన్నదే లక్ష్యమని ప్రణయ్‌ తెలిపారు. 9వ ర్యాంకరైన దివాకర్‌ సాయి తండ్రి శ్రీనివాసరావు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో హెడ్‌ కానిస్టేబుల్‌. తల్లి కాసు మల్లేశ్వరి గృహిణి.  ఐఐటీలో చేరాలన్న లక్ష్యంతో చదివినట్టు దివాకర్‌ సాయి తెలిపాడు. 

8వ ర్యాంక్‌ సాధించిన నెల్లూరు విద్యార్థి
నెల్లూరు మాగుంట లేఅవుట్‌కు చెందిన డి.సాయిప్రణవ్‌ 8వ ర్యాంక్‌ సాధించాడు. ఇతడి తల్లిదండ్రులు మాధవ్, పద్మజ ఇద్దరూ వైద్యులు. తాను మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతానని ప్రణవ్‌ చెప్పాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించానన్నాడు.

మరిన్ని వార్తలు