హంగేరీ నుంచి ఇండియాకు పయనమైన ఏపీ విద్యార్థులు 

6 Mar, 2022 04:19 IST|Sakshi
హంగేరీలో శనివారం బయల్దేరుతున్న ఏపీ విద్యార్థులతో ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ సమన్వయం 

ఇరు దేశాల ఎంబసీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరీతో చర్చలు 

తరలింపు మరింత త్వరితగతిన సాగేలా కార్యాచరణ 

సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చూపిన చొరవ సత్ఫలితాలిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు ప్రత్యేక ప్రతినిధులుగా వెళ్లిన వారు ఇటు కేంద్రం, అటు ఆయా దేశాల్లోని కీలక అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తరలింపు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌.. హంగేరిలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరితో సమావేశమై విద్యార్థుల తరలింపు అంశాల గురించి చర్చించారు.

అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడారు. భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. తత్ఫలితంగా శనివారం ఒక్కరోజే బుడాపెస్ట్‌ నుంచి 100 మంది మన విద్యార్థులు ఇండియాకు బయలుదేరారు. విదేశీ వ్యవహారాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, తెలుగు, భారత అసోసియేషన్లతో మాట్లాడుతూ విద్యార్థుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేస్తున్నామని వెంకట్‌ తెలిపారు. మన విద్యార్థులు ఉంటున్న వసతి కేంద్రాలకు వెళ్లి వారితో మాట్లాడామని చెప్పారు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులతో వారి పిల్లలను ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడిస్తూ ధైర్యం చెబుతున్నామని తెలిపారు. శనివారం ఒక్క రోజే 1,100 మంది భారతీయులను తరలించగా, అందులో వంద మంది మన ఏపీ విద్యార్థులు ఉన్నారన్నారు.     

మరిన్ని వార్తలు