పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి

23 Sep, 2023 05:21 IST|Sakshi
వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్కో వింటర్‌తో ఏపీ విద్యార్థులు

యూఎన్‌ఓ ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో ఏపీ విద్యార్థులు 

నవ భారత నిర్మాణంలో యువత పాత్రపై ప్రసంగం

సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోను బలంగా ఉందని చాటిచెప్పారు.

ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఎస్‌డీజీ సమ్మిట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌కు వీరు హాజరయ్యారు.

యూఎన్‌ఓ స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌కుమార్‌ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్‌ అమ్మాజాన్‌ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై వారు ప్రసంగించారు.

ఏపీలో సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. 

ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి..
ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్‌ హాబిటాట్, యూఎన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్, సివిల్‌ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్‌ఎఫ్, యూత్‌ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్‌ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు.

పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్‌–పేరెంట్‌ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది.

ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెట్టారని అమ్మాజాన్‌ తెలిపింది. షకిన్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారత్‌లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. 

మరిన్ని వార్తలు