ఠారెత్తిస్తున్న ఎండలు

25 May, 2022 04:12 IST|Sakshi

సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

గాల్లో తేమ శాతం తగ్గడంతో పెరిగిపోయిన ఉక్కపోత

మరో వారం పాటు ఎక్కువ గానే ఉండనున్న ఎండలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేడితోపాటు ఉక్కపోత పెరిగిపోతోంది.

ఉదయం 9 గంటలకే.. మధ్యాహ్నం 12 గంటలకు ఉండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరగడం, మరోవైపు గాలిలో తేమ శాతం తగ్గడంతో తీవ్ర వేడి వాతావరణం ఉంటోంది. ఎండ, వడ గాల్పులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధవారం రోహిణి కార్తె కావడంతో రెండు, మూడు రోజులు ఎండ తీవ్రత ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వచ్చే వారం పాటు ఎండలు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 
మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం, అత్తిలిలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కామవరపుకోటలో 45.6, కృష్ణా జిల్లా నందివాడ, గుడివాడల్లో 45.3, తాళ్లపూడి, గోపాలపురంల్లో 44.9, ఉంగుటూరులో 44.8, రాజమహేంద్రవరంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇవి మరింత ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 26న శ్రీలంకను, జూన్‌ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయి.  

మరిన్ని వార్తలు